Antarctica | న్యూఢిల్లీ, అక్టోబర్ 6: అంటార్కిటికా అంటే మంచుతో కప్పి ఉండే కొండలతో నిండి ఉండే తెల్లటి ప్రాంతం మనకు గుర్తుకు వస్తుంది. అయితే అలాంటి అంటార్కిటికా నాటకీయంగా హరితవనంగా మారుతున్నదని, గత మూడు దశాబ్దాలతో పోలిస్తే ఇటీవల కొన్ని ఏండ్లుగా 30 శాతం అక్కడ పచ్చదనం పరుచుకుందని తాజా పరిశోధన వెల్లడించింది. 1986-2021 కాలంలో అంటార్కిటికాలో వృక్ష సంపద చదరపు కిలోమీటర్ నుంచి సుమారు 12 చదరపు కిలోమీటర్లకు.. అనగా 10 రెట్లకు పైగా పెరిగింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టర్కు చెందిన పరిశోధకుల బృందం ఉపగ్రహాల నుంచి సేకరించిన డాటా ఆధారంగా ఈ విషయం గుర్తించారు.
వేగంగా వేడెక్కడమే కారణం
2016-21 మధ్య మార్పు రేటు పరిశీలిస్తే అంటార్కిటికా సముద్ర-మంచు విస్తీర్ణంలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. అదే సమయంలో దానికి సమానంగా వృక్ష సంపద పెరుగుదల ఉందని వారు తమ పరిశోధనలో తేల్చారు. ప్రపంచ సగటుకన్నా అంటార్కిటికా వేగంగా వేడెక్కుతుండటమే దీనికి కారణం కావచ్చునన్నారు. ఇక్కడ పెరుగుతున్న మొక్కలలో అధిక శాతం నాచు జాతికి చెందినవని, భూమిలోని కఠినమైన పరిస్థితుల కారణంగా ఇది సంభవిస్తున్నదని పరిశోధనకు నేతృత్వం వహించిన థామస్ రొనాల్డ్ చెప్పారు. ఒక వేళ భూతాపం పెరిగితే ఈ మొక్కల పర్యావరణ వ్యవస్థలు తమను తాము మరింత స్థాపించుకుంటాయని, దీని కారణంగా అది మరింత విస్తరించి పచ్చదనం పెరుగుతుందని చెప్పారు.
నేలలు పేలవంగా ఉన్నా…
ఇక అంటార్కిటికాలో నేలను పరిశీలిస్తే అక్కడ చాలావరకు పేలవంగా ఉనికిలో లేకుండా ఉంది. అయినప్పటికీ మొక్కల పెరుగుదలలో సేంద్రియ పదార్థాన్ని జోడించడమే కాక, నేల ఏర్పడటానికి దోహదం పడుతున్నది. తద్వారా మరిన్ని మొక్కలు పెరిగి పచ్చదనం విస్తీర్ణం కూడా పెరుగుతున్నదని వారు చెప్పారు.