న్యూఢిల్లీ, జూన్ 20: వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఉనికిలో లేనట్టు గుర్తించిన 111 రాజకీయ పార్టీల పేర్లను తన రిజిస్టర్ నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నిర్ణయించింది. ఈ నమోదిత గుర్తింపు లేని పార్టీలకు సంబంధించి రాష్ర్టాల ఎన్నికల ప్రధానాధికారుల(సీఈవో) నివేదికల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఈసీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఉమ్మడి ఎన్నికల గుర్తుతో సహా సింబల్స్ ఆర్డర్(1968) కింద ఈ పార్టీలకు కల్పించిన వివిధ ప్రయోజనాలను ఉపసంహరించనున్నామని తెలిపింది. అయితే ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉన్న తొలగింపు జాబితాలో ఉన్న ఏ పార్టీయైనా 30 రోజుల్లోగా తగిన ఆధారాలు, పార్టీకి సంబంధించిన వార్షిక ఆడిట్ అకౌంట్లు, కంట్రిబ్యూషన్ రిపోర్టు, వ్యయ నివేదిక, అప్డేట్ చేసిన ఆఫీస్ బేరర్ల లిస్టుతో సీఈవోను సంప్రదించొచ్చని పేర్కొన్నది. ఈనెల ప్రారంభంలో కూడా ఇటువంటి 87 పార్టీలను ఈసీ తన రిజిస్టర్ నుంచి తొలగించింది.