ముంబై, సెప్టెంబర్ 1: వచ్చే లోక్సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసే పొటీచేయాలని విపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశంలో నేతలు తీర్మానించారు. వీలైనంత త్వరగా కూటమిలోని పార్టీల మధ్య ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో సీట్ల సర్దుబాటు, పంపకంపై నిర్ణయం ఉంటుందని తెలిపారు. ‘ఇండియా’ కూటమి మూడో సమావేశం శుక్రవారం మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. వివిధ పార్టీలకు చెందిన 14 మంది సభ్యులతో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొన్నారు. సీట్ల సర్దుబాటుపై ఈ కమిటీ పనిచేస్తుందని కూటమి వర్గాలు వెల్లడించాయి.
భేటీ అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తప్పక ఓడిస్తామని పేర్కొన్నారు. విభేదాలు ఉన్నప్పటికీ, కలిసి పనిచేస్తామన్నారు. లౌకిక శక్తులన్నీ ఏకమవుతుండటంతో అధికార బీజేపీకి భయం పట్టుకొన్నదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. బీజేపీ పాలనలో దేశంలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని, ధరలు నిరంతరంగా పెరుగుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ విమర్శించారు.