Airplane | న్యూఢిల్లీ: గతవారం కజకిస్థాన్, దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదాలు విమానయాన భద్రతపై సర్వత్రా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు విమాన దుర్ఘటన పరిస్థితులు, కారణాలు, ప్రదేశాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ప్రమా దం నుంచి సురక్షితంగా బయటపడిన వారి విషయంలో మాత్రం ఒక అంశం పోలి ఉంది.
అజర్బైజాన్ ఎయిర్లైన్స్ వి మానం వెనుకభాగంలో కూర్చున్న ప్రయాణికులను సహాయక సిబ్బంది రక్షించగా దక్షిణ కొరియా విమాన దుర్ఘటనలో కూడా విమానం వెనుక భాగంలో కూర్చున్న ఇద్దరు సిబ్బంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. గతంలో జరిగిన విమాన ప్రమాదాలను విశ్లేషించి చూస్తే విమానం ముందు భాగంలో ఉన్న సీట్ల కన్నా వెనుకభాగంలో ఉన్న సీట్లే సురక్షితమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
1971 నుంచి 2005 మధ్య జరిగిన విమాన ప్రమాదాలను అమెరికాకు చెందిన ఏవియేషన్ డిజాస్టర్ లాకు సంబంధించిన పాపుల్ మెకానిక్స్ మ్యాగజైన్ అధ్యయనం చేసి ఒక నివేదికను తయారుచేసింది. విమానంలోని వెనుక భాగంలో ఉండే సీట్లే అత్య ంత సురక్షితమని ఈ అధ్యయనంలో తేలిం ది. విమానం ముందు భాగంలోని సీట్లలో కూర్చునే ప్రయాణికుల కన్నా వెనుక భాగంలోని సీట్లలోని ప్రయాణికులకే ప్రమాదాల సమయంలో బతికే అవకాశాలు 40 శాతం అధికమని ఈ అధ్యయనం పేర్కొంది. ఇదే అంశంపై అధ్యయనం చేసిన బ్రిటిష్ జర్నలిస్టు మ్యాక్స్ ఫాస్టర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ అనేక విమాన ప్రమాదాలను అధ్యయనం చేసి తయారుచేసిన ఈ నివేదిక ప్రకారం విమానం ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులు బతికే అవకాశం 49 శాతం మాత్రమే ఉంటుందని ఫాస్టర్ పేర్కొన్నారు. విమానం మధ్య లో కూర్చున్న వారికి బతికే అవకాశాలు 59 శాతం ఉంటాయని అదే విమానం వెనుక భాగంలో కూర్చునే ప్రయాణికులకు బతికే అవకాశాలు 69 శాతం ఉంటాయని ఆయన తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఎక్కువ రేట్ల కన్నా తక్కువ రేట్లకు దొరికే సీట్లే సురక్షితమని అర్థమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
1989లో జరిగిన యునైటెడ్ ఎయిర్లైన్స్ ప్రమాదం విషయానికి వస్తే విమానంలో మొత్తం 269 మంది ప్రయాణికులుండగా అందులో 184 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో ఎక్కువ మంది ఫస్ట్ క్లాస్ వెనుక సీట్లలో కూర్చున్నవారే కావడం గమనార్హం. 2015లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం విమానం వెనుక భాగంలోని మధ్య సీట్లే అత్యంత సురక్షితం. ప్రమాదాల సందర్భంగా ఈ సీట్లలో కూర్చున్నవారు మరణించే అవకాశాలు కేవలం 28% మాత్రమేనని ఈ అధ్యయనం పేర్కొంది.
రెండవ సురక్షిత సీట్లు విమానం మధ్యలోనివని, ఇక్కడ కూర్చున్నవారు మరణించే అవకాశాలు 44 శాతం మాత్రమేనని పేర్కొంది. అయితే చాలా విమానాలలో విమానం రెక్కలను ఇంధన ట్యాంకులుగా ఉపయోగించుకుంటున్నందున రెక్కలు పేలిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి మధ్యలో ఉండే సీట్లు కూడా సురక్షితం కావని మరి కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.