Crime news : సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ప్రయోజకులుగా మారాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవనం సాగించాలని కోరుకుంటారు. కొంతమంది వాళ్లు చెడు పనుల్లో ఉన్నా.. పిల్లలు ఆ దారిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతారు. కానీ న్యూఢిల్లీ (New Delhi) కి చెందిన ఓ తండ్రి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన పాతకక్ష తీర్చుకోవడం కోసం కొడుకును హంతకుడి (Murderer) గా మార్చాడు.
వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్ ఏరియాకు చెందిన అవుచండి గ్రామానికి చెందిన కుషీరామ్ (47) ను 2016లో ప్రాపర్టీ డీలర్ అయిన లఖ్‌పత్ సింగ్ (56) ఓ స్థలం వివాదం విషయంలో తీవ్రంగా కొట్టాడు. దాంతో కుషీరామ్ తొమ్మిది నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. దాంతో కుషీరామ్.. లఖ్‌పత్ సింగ్‌పై పగపెంచుకున్నాడు. అతడిపై ఎప్పటికైనా ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయాడు.
ఈ క్రమంలో తన కొడుకు 18వ పుట్టినరోజుకంటే ఒక్కరోజు ముందు కొడుకుతో కలిసి లఖ్‌పత్ సింగ్‌ను హత్యచేశాడు. మార్నింగ్ వాక్కు వెళ్లిన లఖ్‌పత్ సింగ్‌ను కాపుగాసి క్రికెట్ బ్యాట్లతో కొట్టిచంపారు. ఈ నెల 26న ఈ హత్య జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. తన కొడుకుకు 18 ఏళ్లు నిండితే పెద్దలతో సమానంగా శిక్ష పడుతుందని, 18 ఏళ్ల లోపు అయితే జువైనల్ చట్టం కింద లబ్ధి పొందవచ్చని, అందుకే తన కొడుకు 18వ పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు లఖ్పత్ను హత్యచేశామని కుషీరామ్ పోలీసులకు తెలిపాడు. లఖ్‌పత్ హత్య తన ఒక్కడివల్ల కాదని, అందుకు కొడుకు సాయం తీసుకున్నానని చెప్పాడు. కాగా కుషీరామ్పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.