Dawood Ibrahim | అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం హత్యకు గురైనట్లు
వార్తలు వస్తున్నాయి. విష ప్రయోగం జరుగడంతో కరాచీ ఆసుపత్రిలో చేర్పించినట్లు ప్రచారం
జరుగుతున్నది. దావూద్‌ను సమాది చేశారని, మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్‌తో సహా ఇతర కుటుంబ
సభ్యులను గృహ నిర్బంధంలో ఉంచినట్లు సైతం వార్తలు వచ్చాయి.
అయితే, దావూద్ మరణించినట్లు కరాచీ ఆసుపత్రితో పాటు అధికార వర్గాలు సైతం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, దావూద్ మరణంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అంతకు ముందు డిసెంబర్ 5న కరుడుగట్టిన ఉగ్రవాది లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హంజాలా అద్నాన్‌ను డిసెంబర్ 2-3 మధ్య కరాచీలోని ఇంటి వెలుపల సాయుధులు తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డిసెంబర్ 5న ప్రాణాలు కోల్పోయారు.
గతేడాది కాలంగా పాక్‌లో అనుమానాస్పద స్థితిలో ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది పాకిస్థాన్‌లో భారత్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారు ? వారిని ఎలా హత్య చేశారు ? ఐఎస్ఐ రక్షణలో ఉన్న ఉగ్రవాదులను ఎవరు చంపుతున్నారు ? ఈ ఉగ్రమూకలు భారత్‌లో ఎలాంటి నేరాలకు పాల్పడ్డాయో ఓ సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1) బషీర్ అహ్మద్ పీర్ : హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన టాప్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ ఈ ఏడాది ఫిబ్రవరి 20న పాకిస్తాన్లోరి రావల్పిండిలో చనిపోయాడు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఓ దుకాణం వెలుపల సాయుధుడు తుపాకీతో బషీర్ అహ్మద్ పీర్‌పై కాల్పులు
జరిపాడు. గతేడాది అక్టోబర్ 4న అతడిని భారత్ అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లో పలు
ఉగ్రవాద ఘటనలకు పాల్పడ్డాడు. హిజ్బుల్, లష్కర్ తదితర ఉగ్రవాద సంస్థలను నడిపించేందుకు మాజీ
ఉగ్రవాదులను ఏకం చేసేందుకు ప్రయత్నించాడు.
2) ఖలీద్ రజా : అల్-బదర్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన మాజీ కమాండ్ ఖలీద్ రాజా కరాచీలో ఈ ఏడాది ఫిబ్రవి 28న హత్యకు గురయ్యాడు. ఖలీద్‌ను అతని ఇంటి బయట గుర్తు తెలియని కాల్చి చంపాడు. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సలావుద్దీన్ సన్నిహితుడు ఖలీద్ కశ్మీర్లో టెర్రరిస్టు కమాండర్‌గా కొనసాగాడు. ఆ తర్వాత కరాచీ వెళ్లాడు. కరాచీలో ఉంటూ ఉగ్రవాదులను రిక్రూట్ చేస్తుండేవాడు.
3) సయ్యద్ నూర్ షాలోబర్ : కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసిన సయ్యద్ నూర్ షాలోబర్ మార్చి 4న గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. భారత్ వాంటెడ్ టెర్రరిస్టు జాబితాలో ఉన్న షాలోబర్ను పాక్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. నూర్ పాక్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సహకారంతో కశ్మీర్ ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవాడు. కొత్తగా రిక్రూట్ అయి వచ్చిన ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుండేవాడు.
4) సర్దార్ హుస్సేన్ : హఫీజ్ సయీద్‌తో సన్నిహిత సంబంధాలున్న ఉగ్రవాది సర్దార్ హుస్సేన్ అరైన్
కరాచీలో హతమయ్యాడు. సింధుదేశ్ రివల్యూషనరీ ఆర్మీ (SRA) తీసుకుంది. అతన్ని హతమార్చింది.
జమాత్-ఉద్-దవాకు చెందిన ఉగ్రవాదిని దుకాణం సమీపంలో కాల్పులు జరిపింది. ఆ తర్వాత అతను
ఆసుపత్రిలో మరణించాడు. హుస్సేన్ పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవాల మదర్సా
నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాడు.
5) అబు ఖాసిం : అబూ ఖాసిం పేరు భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో ఉన్నది. సెప్టెంబర్ 8న పాక్
ఆక్రమిత కాశ్మీర్‌లోని మసీదులో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హఫీస్ సయీద్‌కు అత్యంత
సన్నిహితుడు జనవరి ఒకటిన రాజౌరి జిల్లా ధంగ్రీ ఉగ్రదాడి కుట్రదారుడు. ధంగ్రీ గ్రామంలో ఉగ్రవాదులు
జరిపిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 13 మంది గాయపడ్డారు.
6) షాహిద్ లతీఫ్ : పఠాన్‌కోట్ దాడి సూత్రధారి, వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన షాహిద్ లతీఫ్ అక్టోబర్ 11న
సియాల్కోట్లో హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు మసీదుపై కాల్పులు జరుపడంతో
చనిపోయాడు. షాహిద్ లతీఫ్ 1994లో భారతదేశంలో అరెస్టయ్యాడు. లతీఫ్ దాదాపు 16 ఏళ్లపాటు
భారతీయ జైలులో ఉన్నాడు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత 2010లో విడుదలయ్యాడు.
7) ముల్లా బహౌర్ అలియాస్ హోర్ముజ్ : బలూచిస్తాన్‌లోని కెచ్ ప్రాంతంలో ఐఎస్ఐ ఏజెంట్ ముల్లా బహౌర్ అలియాస్ హోర్ముజ్ అక్టోబర్ 11న హత్యకు గురైనట్లు తేలింది. ఇరాన్ నుంచి కుల్‌భూషణ్ జాదవ్‌ను కిడ్నాప్ చేసి.. ఐఎస్ఐకి అప్పగించినట్లు వార్త ప్రచారంలో ఉంది. కుల్‌భూషణ్ జాదవ్ భారత నౌకాదళంలో పని చేసిన పదవీ విరమణ చేసిన ఆయన.. ప్రస్తుతం పాక్ జైలులో ఉన్నారు.
8) దావూద్ మాలిక్ : మసూద్ అజార్‌కు సన్నిహితుడైన మరో ఉగ్రవాది దావూద్ మాలిక్ అక్టోబర్ 20న
ఉత్తర వజీరిస్థాన్‌లో హతమయ్యాడు. ‘జైష్-ఎ-మహమ్మద్’తో పాటు, లష్కరే-ఎ-జబ్బార్, లష్కరే-జాంగ్వీ
ఉగ్రసంస్థలతోనూ దావూద్ మాలిక్‌కు సంబంధాలున్నాయి.
9) మహ్మద్ సలీం : దావూద్ ఇబ్రహీం అనుచరుడు మహ్మద్ అలీం అక్టోబర్ 23న హతమయ్యాడు.
కరాచీలోని ఢిల్లీ కాలనీలో నివసించే సలీంను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి.. మృతదేహాన్ని దర్గా అలీ
షా సఖీ శర్మస్ట్ సమీపంలోని లియారీ నదిలో పడేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని నదిలో నుంచి పోలీసులు
స్వాధీనం చేసుకున్నారు.
10) ఖవాజా షాహిద్ : ఉగ్రవాది ఖవాజా షాహిద్ పోకేలోని ఇంట్లో శవమై కనిపించాడు. 2018లో
జమ్మూలోని ఆర్మీ క్యాంపుపై దాడికి సూత్రధారి. ఖ్వాజా షాహిద్ శిరచ్ఛేదం చేయగా.. మృతదేహం
లభ్యమైంది. నవంబర్ 5న ఈ ఘటన జరిగింది.
11) అక్రమ్ ఖాన్ : మరో ఉగ్రవాది అక్రమ్ అలియాస్ అక్రమ్ ఘాజీ నవంబర్ 9న హతమయ్యాడు. పాక్
బజౌర్‌లో అక్రమ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. ఉగ్రవాది అక్రమ్ ఘాజీ 2018 నుంచి
2020 వరకు లష్కర్ రిక్రూట్మెంట్ సెల్‌కు నాయకత్వం వహించాడు. అలాగే పాక్‌లో భారత వ్యతిరేక
ప్రసంగాలు చేస్తూ రెచ్చగొడుతుండేవాడు. చాలాకాలం తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు.
11. తారిఖ్ రహీమ్ : జైష్ కమాండర్ మౌలానా తారిఖ్ రహీమ్ ఉల్లా తారిఖ్‌ను కాల్చి చంపారు. నవంబర్ 12న ఈ ఘటన జరిగింది. రహీమ్ ఉల్లా భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. మౌలానా మసూద్ అజార్‌తో సన్నిహితంగా ఉండేవాడు. కరాచీలో రహీమ్ ఉల్లాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. కరాచీలో భారత్‌కు వ్యతిరేకంగా బహిరంగ సభల్లో ప్రసంగాలు ఇస్తుండేవాడు.
13) మహ్మద్ ముజమ్మిల్ : సియాల్కోట్లో లష్కర్ ఉగ్రవాది మహ్మద్ ముజామిల్‌ను గుర్తు తెలియని దుండగులు నవంబర్ 14న కాల్చి చంపారు. తన సహచరుడు నయీమ్ ఉర్ రెహ్మాన్‌తో కలిసి సియాల్కోట్లోని పస్రూర్ తహసీల్ ప్రాంతంలో కారులో ఉండగా.. బైక్‌పై వచ్చిన దుండగులు ఖోఖ్రాన్ చౌక్ సమీపంలో కారును ఆపి, ముజమ్మిల్‌తో పాటు అతని సహచరుడిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు.
14. హంజాలా అద్నాన్ : లష్కరే తోయిబా ఉగ్రవాది హంజాలా అద్నాన్ కరాచీలో సాయుధులు డిసెంబర్ 6న కాల్చి చంపారు. హంజాలా 2016లో జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి కుట్ర పన్నాడు. హంజాలా హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు. 26/11 ముంబయి దాడికి హఫీజ్ సూత్రధారి. ఈ ఉగ్రవాదులతో పాటు మరుకొందరూ వివిధ దేశాల్లో హత్యకు గురయ్యారు.
భారత మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు పాక్‌లో హత్యకు గురవుతున్నట్లు కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఉగ్రవాదులను రక్షించేందుకు ఐఎస్ఐ ప్రయత్నం చేస్తున్నా పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. రెండుమూడు వారాల వ్యవధిలో ‘జైష్-ఏ-మహ్మద్’, ‘డీ కంపెనీ’, ‘లష్కరే తోయిబా’, లష్కరే- జబ్బార్, లష్కరే జాంగ్వీ తదితర ఉగ్రసంస్థలకు చెందిన వ్యక్తులు అరెస్టుకు గురవుతున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌లను పాక్ ఐఎస్ఐ అరెస్టు చేసింది. ‘లష్కరే తోయిబా’ చీఫ్ హఫీజ్ సయీద్‌కు భద్రత కల్పించింది. వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సైతం సమకూర్చారు. తమ రహస్య ప్రదేశాల నుంచి బయటకు రావద్దని ఐఎస్ఐ హెచ్చరిస్తున్నది.
ఆధిపత్య పోరులో ఉగ్రవాదులు హతమవుతున్నారా? మరేదైనా కారణం ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ యూజ్ అండ్ త్రో ఫార్ములాపై పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అవసరం లేని ఉగ్రవాదులను హతమార్చేందుకు స్వయంగా ఐఎస్ఐ కుట్ర పన్నినట్లుగా అనుమానిస్తున్నారు. లేదంటే ఉగ్రవాదులు ఆధిపత్య పోరులో ఈ ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల నిపుణుడు సంజీవ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ పాక్‌కు తీవ్రవాద దేశంగా ముద్రపడిందని.. పేదరికం అంచున ఉన్న పాక్ ఉగ్రవాదులు కారణంగా బ్లాక్‌లిస్ట్‌లో వెళ్తుందనే భయంతో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఉగ్రవాదులను నిర్మూలించే పనిలో పడ్డట్లుగా తెలుస్తుందన్నారు.