Dawood Ibrahim | న్యూఢిల్లీ, డిసెంబర్ 18: మాఫియా డాన్, ముంబై పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి. పాకిస్థాన్‌లోని కరాచీలో నివాసముంటున్న దావూద్‌పై అతని సహచరులలో ఒకడు రెండు రోజుల క్రితం విషప్రయోగం చేశాడని, వెంటనే అతడిని దవాఖానకు తరలించారని ఓ వార్త షికారు చేసింది. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని, దవాఖాన వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని కొన్ని కథనాలు వెలువడ్డాయి. కరాచీలోని ఓ దవాఖానలో ఫ్లోర్ మొత్తం ఖాళీ చేసి దావూద్ ఒక్కడినే ఉంచి చికిత్స అందిస్తున్నారని, కేవలం వైద్యులు, కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతిస్తున్నారని ఆ కథనాలు పేర్కొన్నాయి. నిజానికి దావూద్ మరణించాడని, ఆ విషయం బయటకు పొక్కకుండా నిగూఢంగా ఉంచారని మరో కథనం వెలువడింది. మరోవైపు పాకిస్థాన్‌లో ఆదివారం రాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగటంతో దావూద్‌పై వెలువడిన కథనాలకు మరింత బలం చేకూరింది. కరాచీతోపాటు లాహోర్, రావల్పిండి తదితర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్టు పాక్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకల్కు ట్విట్టర్ అకౌంట్లో కూడా దావూద్ మృతికి సంబంధించిన ఒక కథనం కనిపించింది.
దావూద్ క్షేమం.. సురక్షితం: చోటా షకీల్
తమ బాస్ సజీవంగా, సురక్షితంగా ఉన్నారని దావూద్‌కు అత్యంత అనుగు అనచరుడైన చోటా షకీల్ ప్రకటించాడు. ఆయన సీఎన్ఎన్-న్యూస్18 వార్తా సంస్థతో మాట్లాడుతూ.. తాను కూడా దావూద్ మరణ వార్తలు విని షాక్‌కు గురయ్యానని చెప్పాడు. తాను శనివారం రోజునే దావూద్‌ను పలుమార్లు కలుసుకున్నానని వెల్లడించాడు. దావూద్‌పై విష ప్రయోగమూ జరుగలేదు, ఆయన దవాఖానలో కూడా చేరలేదని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ఒక యూట్యూబర్ ఎటువంటి ఆధారాలు లేకుండా దావూద్‌పై విష ప్రయోగం జరిగినట్టు వదంతులు సృష్టించాడని వెల్లడించాయి. ముంబైలో 1993లో జరిగిన భీకర పేలుళ్ల తరువాత దావూద్ పాకిస్థాన్‌కు పారిపోయాడు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ మాఫియా డాన్ పాక్‌లోనే ఉన్నప్పటికీ ఆ దేశం మాత్రం ఇంతవరకు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. దావూద్ పాక్‌లోనే ఉన్నాడని అతని సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ ఇటీవల వెల్లడించాడు.