రాయ్‌పూర్: పెళ్లి కాకపోయినప్పటికీ తల్లిదండ్రుల నుంచి పెళ్లి ఖర్చులను కుమార్తె కోరవచ్చని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తెలిపింది. దీనికి వ్యతిరేకంగా ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన తీర్పును పక్కకు పెట్టింది. దుర్గ్‌లోని భిలాయ్ స్టీల్ ప్లాంట్ (బీఎస్పీ) ఉద్యోగి భునూ రామ్ రిటైర్ కానున్నారు. దీంతో ఉద్యోగ విరమణ అనంతరం ఆయన రూ.55 లక్షలు పొందనున్నారు. ఈ నేపథ్యంలో తనకు పెళ్లి ఖర్చుల కింద రూ.20 లక్షలు ఇవ్వాలని 35 ఏండ్ల అవివాహిత కుమార్తె రాజేశ్వరి డిమాండ్ చేసింది. హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956లోని నిబంధనల ప్రకారం తల్లిదండ్రుల నుంచి పెళ్లి ఖర్చులను పొందే హక్కు తనకు ఉన్నదంటూ 2016లో దుర్గ్‌లోని కుటుంబ కోర్టును ఆమెను ఆశ్రయించింది. తన పేరున రూ.20 లక్షలను భిలాయ్ స్టీల్ ప్లాంట్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది.
కాగా, రాజేశ్వరి పిటిషన్‌ను దుర్గ్ ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. పెళ్లి ఖర్చులను కుమార్తె కోరవచ్చన్న నిబంధన ఏదీ కూడా ఆ చట్టంలో లేదని పేర్కొంది. దీంతో రాజేశ్వరి ఈ తీర్పును ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో సవాల్ చేసింది. బిలాస్‌పూర్‌లోని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆమె పిటిషన్‌ను పరిశీలించింది. హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 నిబంధనల ప్రకారం పెళ్లి కాని కూతురు తన పెళ్లి ఖర్చులను తల్లిదండ్రుల నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చని జస్టిస్ గౌతమ్ భాదురి, సంజయ్ ఎస్ అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
దీంతో మార్చి 21న రాజేశ్వరి పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించినట్లు ఆమె తరుఫు న్యాయవాది ఏకే తివారీ తెలిపారు. దుర్గ్ కుటుంబ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన 2016 ఏప్రిల్ 22 నాటి ఉత్తర్వును బెంచ్ కొట్టివేసిందని చెప్పారు. హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956లోని సెక్షన్ 3(బి) (ii) స్ఫూర్తితో మెరిట్‌లపై తీర్పు కోసం కుటుంబ న్యాయస్థానానికి ఈ విషయాన్ని రిఫర్ చేసినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఇరు పార్టీలను హైకోర్టు ఆదేశించిందన్నారు.