జైపూర్: కుటుంబంలో గొడవల వల్ల ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాల వద్దకు చేరుకున్నాడు. తన బంధువుకు వీడియో కాల్ చేసి ఈ విషయం చెప్పాడు. ఆ వ్యక్తి కూతురు, అతడి సోదరుడు అక్కడకు వచ్చారు. ఆత్మహత్య నుంచి అతడ్ని రక్షించేందుకు ప్రయత్నించారు. (Train Runs Over Three) అయితే రైలు దూసుకెళ్లడంతో ఆ ముగ్గురు మరణించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. జై అంబే నగర్ ప్రాంతంలో నివసించే 40 ఏళ్ల సుమిత్ సైన్ కుటుంబ కలహాలతో మనస్తాపం చెందాడు. దీంతో ఆత్మహత్య చేసుకునేందుకు ఆదివారం జగత్పురా ప్రాంతంలో రైలు పట్టాలపై కూర్చున్నాడు. తన బంధువుకు వీడియో కాల్ చేశాడు. తాను చనిపోతున్నట్లు చెప్పాడు. రైలు పట్టాలను కూడా చూపించి కాల్ కట్ చేశాడు.
కాగా, అప్రమత్తమైన ఆ బంధువు సుమిత్ కుమార్తె 15 ఏళ్ల నిషా, అతడి అన్న 44 ఏళ్ల గణేష్‌కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. దీంతో వారిద్దరూ ఆ రైల్వే క్రాసింగ్ వద్దకు చేరుకున్నారు. రైలు పట్టాలపై కూర్చొన్న సుమిత్‌ను గుర్తించారు. కుమార్తె నిషా, అన్న గణేష్ కలిసి ఆత్మహత్య నుంచి అతడ్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ రైలు పట్టాలపైకి దూసుకొచ్చిన హరిద్వార్ మెయిల్ ఆ ముగ్గురిని ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు.
మరోవైపు లోకోపైలట్ రైల్వే కంట్రోల్ రూమ్‌కు ఈ సమాచారం ఇచ్చాడు. దీంతో రైల్వే, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ విరిగి పడిన మొబైల్ ఫోన్ ద్వారా ముగ్గురు మృతులను గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.