పాట్నా: మహిళా డ్యాన్సర్‌పై ఆమె భర్త ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు వెతుకున్నారు. (Dancer raped) బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆర్కెస్ట్రా డ్యాన్సర్ అయిన మహిళ తన భర్తతో కలిసి శంకర్పూర్ దియారాకు వెళ్లింది. ఏప్రిల్ 29న రాత్రి వేళ అక్కడ జరిగిన పెళ్లి వేడుకలో డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చింది.
కాగా, డ్యాన్స్ ప్రొగ్రామ్ తర్వాత అర్ధరాత్రి వేళ తన భర్తతో కలిసి ఆ మహిళ తిరుగు ప్రయాణమైంది. రైల్వే స్టేషన్‌కు ఎలా వెళ్లాలో తెలియకపోవడంతో రాత్రి వేళ ఒక చోట ఉన్న ముగ్గురు వ్యక్తులను దారి గురించి అడిగారు. అయితే రైల్వే స్టేషన్ వద్ద దింపుతామన్న నెపంతో తమ బైకులపై వారిని ఎక్కించుకున్నారు. సమీప పొలంలోకి తీసుకెళ్లారు. భర్తను నిర్బంధించి అతడి ఎదుటే ఆ డ్యాన్సర్‌పై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనీష్ కుమార్, మనోజ్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.