Daljit Singh : అతడికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ ఇంట్లో మనశ్శాంతి లేదు. రోజూ భార్యతో గొడవలు. దాంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత తనను ప్రేమించే వ్యక్తిని వెతికి పెళ్లి చేసుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఓ డేటింగ్ యాప్లో తన ప్రొఫైల్ను అప్లోడ్ చేశాడు. ఓ యువతితో పరిచయం పెంచుకుని రూ.6.5 కోట్లు పోగొట్టకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన దల్జీత్ సింగ్ అనే వ్యక్తి భార్యతో విడాకుల అనంతరం మరో తోడు కోరుకున్నాడు. తనను ఎంతగానో ప్రేమించే వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకోవాలని భావించాడు. కొన్నాళ్లు డేటింగ్ చేసి తనకు అన్ని విధాల నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఓ డేటింగ్ యాప్లో తన ప్రొఫైల్ను అప్లోడ్ చేశాడు. ఢిల్లీలో ఓ కంపెనీకి డైరెక్టర్గా ఉన్న దల్జీత్ సింగ్కు అనిత అనే అమ్మాయితో డేటింగ్ మ్యాచ్ కుదిరింది. తన ప్రొఫైల్ ఆమె తనది హైదరాబాద్గా పేర్కొన్నది.
సాధారణ పలకరింపులతో మొదలైన ఆ ఇద్దరి పరిచయం అతికొద్ది కాలంలోనే దగ్గరి సంబంధంగా మారిపోయింది. ఇద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. దల్జీత్ నమ్మకాన్ని చూరగొన్న తర్వాత అనిత తాను చెప్పిన విధంగా ట్రేడింగ్ చేస్తే భారీగా లాభాలు రాబట్టవచ్చని చెప్పింది. తనకు తెలిసిన మూడు కంపెనీల్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని తెలిపింది. దాంతో ముందుగా ఒక కంపెనీలో దల్జీత్ రూ.3.2 లక్షల పెట్టుబడి పెట్టాడు.
కొన్ని గంటల్లోనే తన పెట్టుబడిని వాపస్ తీసుకోగా రూ.24 వేల లాభం వచ్చింది. దాంతో అనితపై అతని నమ్మకం రెట్టింపయ్యింది. ఆమె తన మేలును కోరుకునే వ్యక్తని, తనకు మంచి సలహాలు ఇస్తుందని పూర్తిగా నమ్మాడు. అందుకే ఆమె మాటలు నమ్మి తాను అప్పటిదాకా సంపాదించిన రూ.4.5 కోట్లను పెట్టుబడిగా పెట్టాడు. అంతేగాక మరో రూ.2 కోట్ల బ్యాంకు రుణం కూడా తీసుకుని ఇన్వెస్ట్ చేశాడు. అంటే మొత్తం రూ.6.5 కోట్ల పెట్టుబడి పెట్టాడు.
తర్వాత తన పెట్టుబడిని తిరిగి తీసుకునేందుకు దల్జీత్ ప్రయత్నించగా పెట్టుబడిలో 30 శాతం కోతపడుతుందని కంపెనీ వెబ్సైట్ చూపింది. దాంతో డబ్బును వెనక్కి తీసుకోకుండా అనితను సంప్రదించాలని ప్రయత్నించాడు. కానీ ఆమె అప్పటికే అక్కడి నుంచి జారుకుంది. దాంతో డేటింగ్ యాప్లో ఆమె ఇచ్చిన ప్రొఫైల్ ద్వారా ఆచూకీ కనిపెట్టాలని చూశాడు. కానీ ఆ యాప్లో ఆమె ఫేక్ ప్రొఫైల్ పెట్టినట్లుగా తేలింది. దాంతో మోసపోయానని గ్రహించిన దల్జీత్ పోలీసులను ఆశ్రయించాడు.