భోపాల్: దళిత వర్గానికి చెందిన వరుడు గుర్రం బండిపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాడు. (Dalit Groom) అగ్రకులం వ్యక్తులు దీనిపట్ల ఆగ్రహించారు. గుర్రం బండి నిర్వాహకులపై దాడి చేశారు. గన్స్ ఎక్కుపెట్టి వారిని బెదిరించారు. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం దళిత వర్గానికి చెందిన పెళ్లికొడుకు తన బంధువులతో కలిసి గుర్రం బండిపై ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. గుర్రం బండి నిర్వాహకులు దీని కోసం స్థానిక అగ్రవర్ణాల అనుమతి కూడా తీసుకున్నారు.
కాగా, పెళ్లి తంతు పూర్తయిన తర్వాత గుర్రం బండి నిర్వాహకులు తిరిగి వెళ్తుండగా అగ్రకులం వ్యక్తులు దాడి చేశారు. రత్నేష్ ఠాకూర్ నేతృత్వంలో కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. గుర్రం బండిని ధ్వంసం చేశారు. గుర్రం, దాని నిర్వాహకులతోపాటు పెళ్లి అతిథులను కొట్టారు. అహిర్వార్ కమ్యూనిటీ ఇళ్ల సమీపంలో దళిత వరుడి పెళ్లి ఊరేగింపు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ఎందుకు చేశారంటూ గన్స్‌తో బెదిరించి కొట్టారు. వారి వద్ద ఉన్న డబ్బు లాక్కున్నారు.
మరోవైపు దాడిలో గాయపడిన వ్యక్తులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరిపి తగిన చర్యలు చేపడతామని పోలీస్ అధికారి వెల్లడించారు.