లక్నో: ప్రభుత్వ స్కూల్ టీచర్లు దళిత విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆ బాలుడితో స్కూల్ టాయిలెట్ శుభ్రం చేయించారు. అంతేగాక ఆ విద్యార్థిని క్లాస్‌రూమ్‌లో ఉంచి లాక్ వేశారు. (Dalit Boy Locked In Classroom) ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్‌ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. క్లాస్ టీచర్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం జనసత్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల దళిత విద్యార్థిని తరగతి గదిలో ఉంచి తాళం వేశారు. స్కూల్ ముగిసినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో బాలుడి తల్లి ఆందోళన చెందింది. తన కుమారుడి గురించి తోటి విద్యార్థులను ఆరా తీసింది. వారు సమాధానం చెప్పకపోవడంతో స్కూల్‌కు వెళ్లింది. తాళం వేసిన క్లాస్రూమ్ నుంచి కుమారుడి ఏడ్పు విని షాక్ అయ్యింది.
కాగా, దళిత విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఈ విషయం చెప్పారు. దీంతో క్లాస్ టీచర్ భర్త తాళాలు తీసుకుని స్కూల్‌కు చేరుకున్నాడు. క్లాస్రూమ్ తెరువడంతో లోపలున్న బాలుడు బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో దళిత విద్యార్థి తల్లి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దళిత పిల్లలను ద్వేషించే ఇద్దరు ఉపాధ్యాయులు టాయిలెట్ శుభ్రం చేయమని తన కుమారుడ్ని బలవంతం చేస్తున్నారని ఆరోపించింది. అలాగే టీచర్ల నిర్లక్ష్యం వల్ల తన కొడుకును తరగతి గదిలో ఉంచి లాక్ వేశారని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు విద్యాశాఖ అధికారులు ఈ సంఘటనపై స్పందించారు. ప్రిన్సిపాల్ సంధ్యా జైన్‌ను సస్పెండ్ చేశారు. క్లాస్ టీచర్ రవితా రాణికి వార్నింగ్ ఇచ్చారు. స్కూల్ తర్వాత క్లాస్‌రూమ్స్‌కు తాళం వేసేటప్పుడు విద్యార్థులు ఎవరైనా లోపల ఉన్నారా లేదా అన్నది చూసుకోవాలని పేర్కొన్నారు. అయితే క్లాస్ టీచర్ తప్పు వల్ల తనను సస్పెండ్ చేశారని ప్రిన్సిపాల్ సంధ్యా జైన్ వాపోయింది.