హైదరాబాద్: యాదాద్రి ఆలయ జీర్ణోద్దరణ మహాద్భుత రీతిలో సాగుతున్న విషయం తెలిసిందే. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణంపై ఇవాళ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ ప్రత్యేక సంచికను ప్రచురించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకున్న ఆ పత్రిక ఓ స్పెషల్ రూపంలో యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణంపై కథనాన్ని రాసింది. ఆ పత్రిక వెబ్సైట్లోనూ ప్రధాన శీర్షికగా యాదాద్రి కీర్తిని ఇనుమడింపచేసేరీతిలో కథనాన్ని పోస్టు చేసింది. అయోధ్య రామమందిరం కన్నా ఎక్కువ బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి ఆలయ నిర్మాణం జరిగినట్లు ఆ పత్రిక తన హెడ్లైన్లో పేర్కొన్నది. వెయ్యేళ్ల వరకు కూడా నారసింహుడి ఆలయం చెక్కుచెదరని వెల్లడించింది. 125 కేజీల బంగారంతో ఆలయ శిఖరంపై ఉండే విమాన గోపురాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తన కథనంలో దైనిక్ భాస్కర్ పేర్కొన్నది. గడిచిన వందేళ్లలో కేవలం కృష్ణశిలలతో నిర్మితమైన సుందర ఆలయం ఇదొక్కటే అని తెలిపింది. మూడు రోజుల పాటు దైనిక్ భాస్కర్‌కు చెందిన టీమ్ యాదాద్రిలో విశేషరీతిలో ప్రాజెక్టును స్టడీ చేసి ఈ కథనాన్ని రాసింది.
యాదగిరిగుట్ట టెంపుల్ సీఈవో కిషణ్ రావు, ప్రధాన వాస్తు శిల్పి ఆనంద్ సాయితో చేసిన ఇంటర్వ్యూ ఆధారంగా ఈ కథనాన్ని డెవలప్ చేశారు. భువనగిరి జిల్లాలో ఉన్న ఈ ఆలయం వెయ్యేళ్ల కన్నా పురాతనమైందని, లక్ష్మీ నరసింహుడు స్వయంభువుగా వెలిశాడని, ఎన్నో చిత్రాలతో కూడిన కథనాన్ని రాశారు. యాదాద్రి జీర్ణోద్దరణకు 1200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు దైనిక్ భాస్కర్ తన రిపోర్ట్‌లో తెలిపింది. ఆలయ నిర్మాణాలకు చెందిన ఆగమ, వాస్తు, పంచ శాస్త్రాల ప్రకారమే యాదాద్రి నిర్మాణం జరిగినట్లు చెప్పింది. దక్షిణ భారత దేశంలో వైష్ణవ సంప్రదాయానికి చెందిన ఆరు ప్రధాన ఆలయాలను స్టడీ చేసిన తర్వాత యాదాద్రి నిర్మాణ శైలికి శ్రీకారం చుట్టినట్లు రాశారు. నిర్మాణానికి వాడిన రాళ్లను కూడా టెస్టింగ్ చేసినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం కోసం మొదటి పిల్లర్ ఎప్పుడు వేశారో, ఆ తర్వాత ఏ దశల్లో నిర్మాణం కొనసాగిందో ఆ కథనంలో వెల్లడించారు. గ్రాఫిక్ రిప్రజెంటేషన్‌తో ఆలయ విశిష్టితలకు చెందిన ఎంతో విలువైన సమాచారాన్ని తమ రిపోర్ట్‌లో దైనిక్ భాస్కర్ పొందుపరిచింది. మార్చ్ నుంచి గర్భగుడిలోకి భక్తులను అనుమతించనున్నారు. 21 నుంచి 28 మార్చి వరకు యజ్ఞం, పూజా విధులను నిర్వహించనున్నారు. కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేసి ఆ కథనాన్ని మీరు కూడా చూడవచ్చు.