బెంగుళూరు, జూన్ 3 : కర్ణాటక కొత్త సీఎంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు మాజీ సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు హాజరయ్యారు. 13 మంది మంత్రులుగా, సీనియర్ లీడర్ పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 28న సిద్ధరామయ్య రాజీనామా చేయ గా.. 29న డీకే సీఎల్పీ నేతగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మూడేండ్లు సిద్ధరామయ్య సీఎంగా పనిచేయగా.. ఇప్పుడు డీకే రెండేండ్లు పనిచేయబోతున్నారు.
డీకే క్యాబినెట్లో పరమేశ్వర డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక మంత్రులుగా కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జార్కిహోలి, క్రిష్టా బైరెగౌడ, ప్రియాంక్ ఖర్గే, యూటీ ఖాదర్, ఈశ్వర్ ఖండ్రే, యతీంద్ర సిద్ధరామయ్య, బైరతి సురేశ్, శరన్ ప్రకాశ్ పాటిల్‌లు ప్రమాణస్వీకారం చేశారు. ఖాదర్, యతీంద్ర మినహా మిగతా వారంతా సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారే. ఇక సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది.