బెంగళూరు, మే 29 : కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తుండగా కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగనున్నారు. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పదోన్నతికి మార్గం సుగమం చేసేందుకు తన పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యహరించేందుకు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ప్రతిపాదించినట్లు తెలిసింది. కొత్త మంత్రులతో కలసి డీకే వచ్చే వారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.
శుక్రవారం ఢిల్లీ చేరుకున్న సిద్ధరామయ్య పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలుసుకుని తన డిమాండ్ల జాబితాను సమర్పించినట్లు తెలిసింది. డీకే శివకుమార్ నేతృత్వంలోని కొత్త క్యాబినెట్లో తన కుమారుడు యతీంద్రకు కీలక శాఖలు కేటాయించాలని ఆయన కోరినట్లు సమాచారం. సిద్ధరామయ్య క్యాబినెట్లో పీడబ్ల్యూడీ మంత్రిగా పనిచేస్తున్న సతీష్ జార్కిహోళికి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని అధిష్ఠానం ఆఫర్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. అయితే తన రాజకీయ గురువు సిద్ధరామయ్యతో చర్చించిన తర్వాత తన నిర్ణయం తెలియచేస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. కాగా, సిద్ధరామయ్య డిమాండ్లలో ఎన్నిటిని అధిష్ఠానం ఆమోదిస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. సీఎం సిద్ధరామయ్య ఈ నెల 28న (గురువారం) తన పదవికి రాజీనామా చేయగా శుక్రవారం గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ దాన్ని ఆమోదించడంతో డీకే ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది.