బెంగళూరు, మే 28 : కర్ణాటకలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య గురువారం తన పదవికి రాజీనామా చేసి తన బద్ధ శత్రువైన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు మార్గం సుగమం చేశారు. రాష్ట్ర గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ రాష్ట్రంలో లేని కారణంగా సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యదర్శికి అందజేశారు.
గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్యతో హోరాహోరీ పోరు సాగించిన డీకే కుల సమీకరణాలు సమతుల్యంగా ఉండేలా చూసేందుకు ఇద్దరు, ముగ్గురు డిప్యూటీలతో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. తన రాజీనామా అనంతరం కొద్దిసేపటికే విలేకరుల సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ తాను కొత్త ముఖ్యమంత్రికి మార్గం సుగమం చేస్తున్నానని చెప్పారు. రెండు రోజుల క్రితం పార్టీ అధిష్ఠానం నన్ను పదవి నుండి తప్పుకోవాలని కోరింది. అందుకే నేను రాజీనామా చేశాను అని 2006లో కాంగ్రెస్‌లో చేరిన సిద్ధరామయ్య అన్నారు. పార్టీలో మనస్పర్థలు ఏర్పడ్డాయన్న ఊహాగానాలను తోసిపుచ్చుతూ కర్ణాటకలో కాంగ్రెస్ ఒకే కుటుంబంగా ఉంటుందని సిద్ధరామయ్య నొక్కి చెప్పారు.
కర్ణాటక రాజకీయాల్లోనే చురుకుగా కొనసాగుతానని, జాతీయ స్థాయి పాత్రను చేపట్టాలన్న ఆసక్తి లేదని సిద్ధరామయ్య తెలిపారు. తన రాజీనామా తర్వాత రాజ్యసభ సీటు ఇస్తామన్న కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆయన వెల్లడించారు. జాతీయ రాజకీయాల పట్ల నాకు ఆసక్తి లేదు. ఎమ్మెల్యేగా నాకింకా రెండేండ్ల పదవీకాలం ఉంది. కర్ణాటక కోసం పనిచేస్తాను అని ఆయన చెప్పారు. హైకమాండ్ నాకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసింది. వద్దని చెప్పాను అని ఆయన తెలిపారు. సిద్ధరామయ్య రాజీనామాను నిరసిస్తూ ఆయన మద్దతుదా రులు పలుచోట్ల ఆందోళన చేశారు.

సిద్ధరామయ్య తన నిష్క్రమణ రాజకీయంగా నిశ్శబ్దంగా ఉండకూడదని నిశ్చయించుకున్నట్లు కనపడుతున్నది. వాస్తవానికి ఆయన ఒక టైమ్ బాంబ్ పెట్టి సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు. అది ఆయన వారసుడైన డీకే శివకుమార్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని భయపెడుతూనే ఉంటుంది. వివాదాస్పదమైన వెనుకబడిన తరగతుల కమిషన్‌కు చెందిన సామాజిక-ఆర్థిక, విద్యా సర్వే(కులగణన) నివేదికను బుధవారం అధికారికంగా ఆమోదించడం ద్వారా డీకే, రాహుల్ గాంధీపై సిద్ధరామయ్య నిశ్శబ్దంగా ప్రతీకారం తీర్చుకుని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పదవి నుంచి దిగిపోవడానికి ముందు కులగణన నివేదికను ఆమోదించాలన్న సిద్ధరామయ్య నిర్ణయం తన చిట్టచివరి వ్యూహాత్మక సందేశంగా భావిస్తున్నారు.
రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ పని చేశారు. అధికారికంగా ఇది సీఎం పాలనాపరమైన చర్య అయినప్పటికీ ఆయనకు నివేదిక అందిన సమయం దీనిని ఒక గాఢమైన రాజకీయ చర్యగా మార్చేసింది. కర్ణాటకలోని అత్యంత వెనుకబడిన తరగతుల నాయకుడిగా తన ప్రతిష్టను పటిష్టంగా నిలబెట్టుకున్న తర్వాతే సిద్ధరామయ్య పదవి నుంచి వైదొలగాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కానీ ఈ తరుణంలో ఆ నివేదికను అంగీకరించడం ద్వారా దాని పర్యవసానాలను ఎదుర్కొనాల్సిన భారం పూర్తిగా తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే డీకే శివకుమార్‌పై పడేలా ఆయన చూసుకున్నట్లు కనపడుతున్నది.