Cylinder blast : ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ (Gas cylinder) పేలి నలుగురు పదేళ్లలోపు చిన్నారులు దుర్మరణం పాలైన ఘటన బీహార్ (Bihar) లోని ముజఫర్‌పూర్ జిల్లా (Muzaffarpur district) లో బుధవారం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో వంట చేస్తూ తల్లి బయటికి వెళ్లిన సమయంలో మంటలు సిలిండర్‌కు అంటుకుని పేలుడు సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్‌పూర్ జిల్లాలోని బరియార్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల రాంపూర్మని గ్రామానికి చెందిన మహిళ ఇంట్లో వంట చేస్తూ మిగతా వంటపాత్రలు కడిగేందుకు బయటికి వెళ్లింది. అదే సమయంలో స్టవ్ మంటలు సిలిండర్‌కు అంటుకుని పేలిపోయింది. దాంతో ఇంట్లో ఉన్న నలుగురు చిన్నారులు బ్యూటీ కుమారి (8), విపుల్ కుమార్ (5), సృష్టి కుమారి (4), హన్సిక కుమారి (3) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. కాగా ఈ పేలుడు ఘటనలో మరణించిన చిన్నారుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున మొత్తం 16 లక్షలు అందజేయనున్నట్లు ముజఫర్‌పూర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.