e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home Top Slides ముంచుకొస్తున్న తుఫాను

ముంచుకొస్తున్న తుఫాను

ముంచుకొస్తున్న తుఫాను
  • వానొస్తుంది.. రైతన్నా జరభద్రం
  • మంగళవారం గుజరాత్‌ తీరం దాటనున్న ‘తౌక్టే’
  • ఐఎండీ అంచనా..
  • ఐదు రాష్ర్టాలకు హెచ్చరికలు
  • శని, ఆదివారాల్లో తెలంగాణలో వర్షాలు

హైదరాబాద్‌, మే 14 (నమస్తే తెలంగాణ): అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. తుఫాను సోమవారం నాటికి అతి తీవ్రరూపం దాల్చి మంగళవారం గుజరాత్‌ తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం తెలిపింది. ఈ సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని పేర్కొన్నది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కేరళలో శుక్రవారం పలుచోట్ల వర్షాలు పడ్డాయి. పశ్చిమ తీరంతోపాటు పలు రాష్ర్టాల్లో శని, ఆదివారాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. తుఫాను తీవ్రత నేపథ్యంలో తీర రాష్ర్టాలకు విపత్తు నిర్వహణాదళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) సహాయక బృందాలను పంపుతున్నది. ఈ ఏడాది భారత తీరంలో ఏర్పడిన మొట్టమొదటి తుఫాను ఇదే. దీనికి మయన్మార్‌ తౌక్టే అని పేరు పెట్టింది. తౌక్టే అంటే బర్మా భాషలో ‘బల్లి’ అనిఅర్థం.

ముంచెత్తిన వాన

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌, మే 14: ఉపరితల ద్రోణి, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దవ్వగా, వేర్వేరు జిల్లాల్లో పిడుగులు పడి పలు జిల్లాల్లో ఆరుగురు మృతిచెందారు. కరీంనగర్‌ జిల్లాలో గన్నేరువరం, తిమ్మాపూర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. శంకరపట్నం, చిగురుమామిడి, సైదాపూర్‌, మానకొండూర్‌, కరీంనగర్‌, కొత్తపల్లి మండలాల్లోనూ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా, మెదక్‌ జిల్లా రామాయంపేట్‌, తూప్రా న్‌, నర్సాపూర్‌, మనోహరాబాద్‌, చేగుంట ప్రాంతాల్లో వానపడింది. సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఒకేరోజు పిడుగుపాటుకు నలుగురు బలయ్యారు. మొగుడంపల్లికి చెందిన కృష్ణ(32), తన కొడుకు ప్రశాంత్‌(10) పిడుగుపడి మృతిచెందారు. సమీపంలోనే ఉన్న పశువుల కాపరి బాగయ్యకు స్వల్పగాయాలయ్యాయి. పుల్కల్‌ మండ లం పోచారంలో పిడుగుపాటుతో బుసరెడ్డిపల్లి చంద్రయ్య(55) అనే మేకల కాపరి చనిపోయాడు. కంగ్టి మండలం బొర్గి గ్రామానికి చెందిన సురేశ్‌(34) పిడుగుపడి మృతిచెందాడు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో ఒర్సు మల్లయ్య (50), అల్లెపు రవి (42) మేకలు కాస్తుండగా పిడుగుపడి మృతి చెందారు.

రెండు రోజులు విస్తారంగా వానలు

తుఫాను కారణంగా శని, ఆదివారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న వెల్లడించారు. సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, గద్వాల-జోగులాంబ, మహబూబ్‌నగర్‌, ములు గు, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్నిచోట్ల ఓ మోస్తరు వానలు కురుస్తాయని వివరించారు. శుక్రవారం రాష్ట్రంలోని కరీంనగర్‌, వికారాబాద్‌, మెదక్‌, నల్లగొండ, మేడ్చల్‌-మల్కాజిగిరి, కామారెడ్డి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వానలు కురిశాయి. పలుచోట్ల వడగండ్లు పడ్డాయి. వివిధ ప్రాంతాలలో రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది.

ఒకరోజు ముందే నైరుతి

31న కేరళలోకి: ఐఎండీ
న్యూఢిల్లీ, మే 14: సాధారణం కంటే ఒక రోజు ముందుగానే మే 31న నైరుతి రుతుపవనాలు కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించనున్నాయి. సాధారణంగా జూన్‌1న రుతుపవనాలు వస్తుంటాయి. అయితే, నాలుగు రోజులు ముందు వెనుకగా (ప్లస్‌ ఆర్‌ మైనస్‌ మోడల్‌ ఎర్రర్‌) ఈ ఏడాది రుతుపవనాల ఆగమనం ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం ప్రకటించింది. రుతుపవనాల రాకను సూచిస్తూ దక్షిణ అండమాన్‌ సముద్రం ప్రాంతంలో వర్షాలు మొదలై.. వాయవ్య దిశగా బంగళాఖాతం మీదుగా విస్తరిస్తాయి. ఐఎండీ తాజా అంచనాల ప్రకారం.. మే 22 ప్రాంతంలో అండమాన్‌ సముద్రం మీదుగా రుతుపవనాలు ప్రవేశించవచ్చని తెలుస్తున్నది. దేశంలో 75 శాతం వర్షపాతానికి ఆధారంగా ఉండే నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణంగానే ఉంటాయని ఐఎండీ గతనెలలో అంచనాలను వెలువరించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముంచుకొస్తున్న తుఫాను

ట్రెండింగ్‌

Advertisement