అగర్తల: పెంపుడు ఏనుగు (Elephant Chandratara) సరిహద్దులు దాటింది. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి ప్రవేశించింది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు దానిని బంధించారు. ఆ ఏనుగు తనదని, తనకు అప్పగించాలని బంగ్లాదేశ్ వ్యక్తి కోరాడు. అయితే ఆ ఏనుగు యాజమానులం తామేనని మరో ఇద్దరు వ్యక్తులు వాదించారు. ఈ నేపథ్యంలో సరిహద్దులు దాటిన ఆ ఏనుగుపై యాజమాన్య హక్కుల వివాదం చివరకు కోర్టుకు చేరింది. గత ఏడాది సెప్టెంబర్ 11న చంద్రతార అనే పెంపుడు ఏనుగు దారి తప్పింది. బంగ్లాదేశ్ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించింది.
కాగా, త్రిపురలోని ఉనకోటి జిల్లాకు చెందిన సరిహద్దు గ్రామంలో ఆ ఏనుగును స్థానికులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో త్రిపుర అటవీ శాఖ అధికారులు ఆ ఏనుగును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అది తిరిగి బంగ్లాదేశ్‌లోకి వెళ్లలేకపోయింది.
మరోవైపు ఆ ఏనుగు తనదని బంగ్లాదేశ్‌కు చెందిన అతికుర్ రెహమాన్ తెలిపాడు. పెంపుడు ఏనుగు చంద్రతార ఫొటోలు, దానిపై యాజమాన్య హక్కు పత్రాలను చూపించాడు. భారత్‌లోని తన బంధువుల ద్వారా బీఎస్ఎఫ్, త్రిపుర అటవీ శాఖ అధికారులకు ఆ ఆధారాలు పంపించాడు.
కాగా, ఆ ఏనుగు తమదని దేశంలోని మరో ఇద్దరు వ్యక్తులు పేర్కొన్నారు. దీంతో ఏనుగుపై యాజమాన్య హక్కుల వివాదం చివరకు కోర్టుకు చేరింది. మంగళవారం ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగనున్నది.