అగర్తలా: ఏకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కార్యాలయాన్ని దొంగలు టార్గెట్ చేశారు. బీరువాలు, డోర్లు, కిటికీలతో సహా ఫర్నీచర్ మొత్తాన్ని లూఠీ చేశారు. ఒట్టి గోడలు మినహా వస్తువులేవీ కనిపించకపోవడం చూసి సీబీఐ అధికారులు షాక్ అయ్యారు. (Theft In CBI Office) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొందరిని అరెస్ట్ చేశారు. త్రిపుర రాజధాని అగర్తలాలో ఈ సంఘటన జరిగింది. శ్యామలీ బజార్ క్వార్టర్ కాంప్లెక్స్‌లోని సీబీఐ క్యాంప్ ఆఫీస్ గత ఐదు నెలలుగా మూసి ఉంది.
కాగా, ఫిబ్రవరి 11న సీబీఐ అధికారులు ఈ కార్యాలయానికి వచ్చారు. అత్యంత భద్రత ఉండే క్యాంప్ ఆఫీస్‌లోకి వెళ్లి చూశారు. అయితే అందులోని వస్తువులు, ఫర్నీచర్ మాయం కావడం చూసి కంగుతిన్నారు. స్టీల్ బీరువాలు, కుర్చీలు, విద్యుత్ పరికరాలు, తలుపులు, కిటికీలు ఇలా ప్రతిదాన్ని దొంగలు ఎత్తుకెళ్లడంతో షాక్ అయ్యారు.
మరోవైపు సీబీఐ ఇన్స్పెక్టర్ అనురాగ్ ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. శ్యామలీ బజార్, ఖేజుర్ బగన్ ప్రాంతాలకు చెందిన ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు. ఎనిమిది స్టీల్ బీరువాలు, ఏడు చెక్క కుర్చీలు, నాలుగు చైర్స్, నాలుగు కిటికీలు, ఒక గీజర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, సీబీఐ కార్యాలయంలో చోరీ వెనుక ఏదైనా కుట్ర ఉన్నదా? ఫైల్స్ ఏమైనా మాయమయ్యాయా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.