న్యూఢిల్లీ : వీధి కుక్కల కేసులో రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 27న ఇచ్చిన ఆదేశాల్లో, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు) నవంబర్ 3 ఉదయం 10.30 గంటలకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని తెలిపింది. వీధి కుక్కల కేసులో తాము ఇచ్చిన ఆదేశాల అమలుపై అఫిడవిట్లను సమర్పించాలని చెప్పింది.
పశ్చిమ బెంగాల్, తెలంగాణ మినహా మిగిలిన రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్‌లు వర్చువల్ విధానంలో కోర్టుకు హాజరయ్యేందుకు అనుమతించాలని సొలిసిటర్ కోర్టుకు ఓ విన్నపం చేశారు. అందుకు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం తిరస్కరించింది. సీఎస్‌లు తప్పనిసరిగా వ్యక్తిగతంగానే హాజరుకావాలని ఆదేశించింది. తమ ఆదేశాలపై సీఎస్‌లు నిద్రపోతున్నారని మండిపడింది.