బీజాపూర్: చత్తీస్‌ఘడ్‌లోని కర్రెగుట్టల్లో జరిగిన కూంబింగ్ ఆపరేషన్ సమయంలో.. సీఆర్పీఎఫ్కు చెందిన రోలో అనే రెండేళ్ల ఆడ కుక్క(CRPF Dog) మృతిచెందింది. యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో తేనటీగలు జరిపిన దాడి వల్ల ఆ శునకం ప్రాణాలు కోల్పోయింది. తేనటీగలు సుమారు రెండు వందల సార్లు కరిచినట్లు అధికారులు గుర్తించారు. 21 రోజుల పాటు యాంటీ నక్సల్ ఆపరేషన్ జరిగింది. అయితే మే 11వ తేదీన ఆ ఆపరేషన్ నిలిపివేశారు. ఏప్రిల్ 27వ తేదీన రోలో స్నిఫర్ డాగ్ .. తేనటీగల దాడిలో చనిపోయింది.
ఆపరేషన్ సమయంలో పేలుడు పదార్ధాలు, ఐఈడీలను గుర్తించేందుకు రోలో శునకాన్ని వాడారు. మరణానంతరం ఆ శునకానికి మెడల్ ఇస్తున్నట్లు సీఆర్పీఎఫ్ డీజీ ప్రకటించారు. కర్రెగుట్ట ఆపరేష్‌ను సీఆర్పీఎఫ్, చత్తీస్ఘడ పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు. 31 మంది మావోయిస్టులు ఆ ఆపరేషన్‌లో హతమయ్యారు. నక్సల్స్‌కు భారీ దెబ్బ తగిలింది. చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్, తెలంగాణలోని ములుగు జిల్లా మధ్యలో కర్రెగుట్టలున్నాయి. ఇక్కడ ఉన్న దట్టమైన అడవుల్లో పలు రకాల వన్య మృగాలు ఉన్నాయి.
రోలో శునకం బెల్జియన్ షెపర్డ్ జాతికి చెందినది. పోలీసులు బృందాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఏప్రిల్ 27వ తేదీన ఓ పార్టీపై సడెన్‌గా తేనటీగలు దాడి చేశాయి. అయితే రోలో శునకానికి పాలిథీన్ షీట్‌ను చుట్టినా.. కొన్ని ఆ షీట్లోకి వెళ్లి దాన్ని కుట్టాయి. నొప్పి తట్టుకోలేకపోయిన ఆ శునకం.. తీవ్ర ఇబ్బందిలో షీట్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ సమయంలో మరిన్ని తేనటీగలు మరింత ఉదృతంగా రోలోను కుట్టాయి. తేనటీగల దాడికి స్పహృ తప్పిపోయింది. ఎమర్జెన్సీ చికిత్స అందించినా.. వెటిరినరీ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ఆ శునకం ప్రాణాలు కోల్పోయింది. బెంగుళూరులోని సీఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రంలో రోలోకు ట్రైనింగ్ ఇచ్చారు.