న్యూఢిల్లీ, మే 1: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. కొత్త ఉద్యోగాల మాట అటుంచితే ఉన్న ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడం లేదు. హోంమంత్రిత్వ శాఖ, రక్షణ, రైల్వే శాఖతో పాటు పలు ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖల్లో వేలాది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వ్డ్ పోస్టులు ఖాళీగా మగ్గిపోతున్నాయి. వీటి భర్తీని కేంద్రం చేపట్టట్లేదు. చూద్దాంలే.. చేద్దాంలే అన్నట్టుగా నామ్కేవాస్తేగా అప్పుడప్పుడు స్వల్ప సంఖ్యలో మాత్రమే భర్తీ చేస్తూ మిన్నకుండిపోతున్నది. దీంతో వేలాది సంఖ్యలో రిజర్వ్డ్ పోస్టులు బ్యాక్‌లాగ్‌లో పడిపోతున్నాయి. దేశ జనాభాలో దాదాపు 70 శాతం వరకు ఉండే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి పట్ల మోదీ సర్కార్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఇక్కడే అర్థమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బ్యాక్‌లాగ్‌పై దృష్టికి నో ఏజెన్సీ!
కేంద్ర మంత్రిత్వ శాఖల్లో రిజర్వ్డ్ పోస్టుల బ్యాక్‌లాగ్‌పై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం ఎటువంటి ఏజెన్సీ లేదా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు. సిబ్బంది, ప్రజాఫిర్యాదులకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఇటీవల తన డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ (2022-23) 112వ నివేదికలో ఇదే అంశాన్ని లేవనెత్తింది. రిజర్వ్డ్ ఖాళీల బ్యాక్లాగ్ వివరాలు, వాటి భర్తీ పురోగతిని తెలిపేలా అధికారిక వెబ్సైట్లలో ఒక డ్యాష్‌బోర్డు ఉండేలా చేయాలని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను పర్యవేక్షించేందుకు పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించాలని సూచించింది.