న్యూఢిల్లీ, అక్టోబర్ 29: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాయుధ దళాల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ నియామక పథకంపై అగ్నివీరుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాజా అధ్యయనం ప్రకారం 72 శాతం మంది అగ్నివీరులు ఉద్యోగ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాల గురించి 52 శాతం మంది ఆందోళన చెందుతున్నారు. అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన అభ్యర్థులు సాయుధ దళాలలో నాలుగు సంవత్సరాల పాటు పనిచేస్తారు. ఆ తర్వాత వీరిలో 25 శాతం మందిని మాత్రమే పర్మనెంట్ సర్వీసుకు ఎంపిక చేస్తారు. మిగిలిన 75 శాతం మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. తాజాగా దీనిపై ఓ సర్వే జరిగింది. డాక్టర్ శర్మిష్ట సోలంకి గైడెన్స్లో ఎంఎస్ యూనివర్సిటీకి చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ వర్క్ విద్యార్థి మనీష్ జన్గిడ్ ఈ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 50 మంది అగ్నివీరులను సర్వే చేయగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
అగ్నిపథ్ పథకంపై సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. నాలుగేళ్ల తర్వాత దీర్ఘకాల సర్వీసును కొనసాగించాలన్న ఆకాంక్షను 54 శాతం మంది వ్యక్తం చేయగా పర్మనెంట్ సర్వీసుకు ఎంపిక కావడంపై కేవలం 26 శాతం మంది మాత్రమే ఆసక్తిని వ్యక్తం చేశారు. పని వత్తిడి ఉన్నట్టు 72 శాతం మంది అంగీకరించగా, శిక్షణా ప్రమాణాలకు సంబంధించి 40 శాతం మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. సర్వీసును నాలుగేళ్లకే పరిమితం చేయడం తమలో ఉద్యోగ సంతృప్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది అగ్నివీరులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక భవిష్యత్తు ఉద్యోగ అవకాశాల గురించి 45 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. 8 శాతం మంది పూర్తి నైరాశ్యాన్ని వ్యక్తం చేశారు. 34 శాతం మంది మాత్రం నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత ఉద్యోగావకాశాలపై ఆశాభావం వ్యక్తం చేశారు.
అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం సిక్కు యువకుల మృతికి కారణమైన రెండు ట్రక్కు ప్రమాదాలు, కార్గో చోరీ ఘటనలను పురస్కరించుకుని ఇటీవల 54 మంది భారతీయ యువజనులను న్యూయార్క్-న్యూఢిల్లీ పౌర విమానంలో పంపించివేసింది. చేతికి సంకెళ్లతో వీరంతా అమెరికా నుంచి వాపసు వచ్చారు. వీరిలో అధిక శాతం మంది హర్యానాకు చెందిన వారు కాగా మిగిలినవారు పంజాబ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, గోవాకు చెందిన వారు. కాగా, మోదీ ప్రభుత్వ తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం కారణంగానే యువజనులు ఏదో విధంగా అమెరికా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటున్నారని బీకేయు అధికార ప్రతినిధి తేజ్వీర్ సింగ్ అంబాల తెలిపారు. కొవిడ్-19 తర్వాత రెగ్యులర్ సైనిక నియామకం నిలిపివేసి అగ్నిపథ్ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, దీంతో నిస్పృహకు గురైన అనేకమంది యువజనులు డంకీ మార్గాల ద్వారా అమెరికా బాట పట్టారని ఆయన చెప్పారు.