ప్రాతినిధ్య డాటాను రాష్ర్టాలే సేకరించాలి
క్యాడర్ పోస్టులను బట్టే ఈ డాటా
ఎస్సీ, ఎస్టీల పదోన్నతులపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జనవరి 28: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రిజర్వేషన్ కల్పనలో తామెలాంటి ప్రమాణాలను నిర్దేశించలేమని స్పష్టం చేసింది. ప్రాతినిధ్య ప్రమాణాలను నిర్ణయించడానికి కొత్త కొలమానం సూచించలేమని పేర్కొన్న ధర్మాసనం.. జర్నైల్ సింగ్ వర్సెస్ కేంద్రప్రభుత్వం, నాగరాజ్ వర్సెస్ కేంద్రప్రభుత్వం కేసుల్లో ఇదివరకు ఇచ్చిన తీర్పులను గుర్తు చేసింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలు గణాంకాలు సేకరించాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యంపై సేకరించే ఈ డాటా మొత్తం సర్వీసు ఆధారంగా కాకుండా పదోన్నతులు పొందగోరే గ్రేడ్/క్యాటగిరీలో ఉన్న పోస్టుల సంఖ్యను బట్టి ఉండాలని వెల్లడించింది. సర్వీసు ఆధారంగా డాటాను సేకరించినట్లయితే ఆ డాటాను పరిగణించవద్దని రాష్ర్టాలను ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం ఉంటే రాష్ర్టాలు తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాలన్నది. దామాషా ప్రాతినిధ్యం, తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలన్నీ రాష్ర్టాలే పరిశీలించాలని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల పదోన్నతులకు రిజర్వేషన్ల కల్పనలో ప్రమాణాలను నిర్దేశించడంలో ఎదురవుతున్న సమస్యలను దూరం చేయాలని కోరుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వాదనలు విన్న ధర్మాసనం గతేడాది అక్టోబర్ 26న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తాజాగా తీర్పు వెలువరించింది.