Crime news : ఆ ఇద్దరు యువతులు ప్రాణ స్నేహితులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. నిత్యం ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకరి పేరును మరొకరు చేతులపై పచ్చబొట్లుగా కూడా పొడిపించుకున్నారు. కలిసి స్నేహం చేసిన వాళ్లిద్దరూ చివరికి కలిసే ప్రాణాలు కోల్పోయారు. కొన్ని నిమిషాల వ్యవధిలో ఇద్దరూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. బాందా జిల్లా దెహత్ కొత్వాలి ఏరియాలోని జారీ గ్రామానికి చెందిన పుష్పాదేవి ప్రజాపతి (18), గాయత్రి (19) అనే ఇద్దరు యువతులు ప్రాణ స్నేహితులు. శుక్రవారం ఈ ఇద్దరూ ఎవరి ఇళ్లలో వాళ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. చలికాలంలో వెచ్చటి దుస్తులు కొనుగోలు చేయలేకపోయాననే బాధతో గాయత్రి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని గాయత్రి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలిస్తుండగానే.. ఆమె స్నేహితురాలు పుష్పాదేవి ప్రజాపతి కూడా తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందింది. నిమిషా వ్యవధిలో ప్రాణస్నేహితురాళ్లిద్దరూ ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.