Crime news : అనుమానం పెనుభూతమై ఓ అభం శుభం తెలియని పసివాడి ప్రాణం తీసింది. భార్యపై అనుమానంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన మూడేళ్ల కొడుకు గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత బార్‌కు వెళ్లి ఫూటుగా మద్యం సేవించి పడిపోయాడు. మహారాష్ట్ర (Maharastra) లోని పుణె నగరం (Pune city) లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. పుణెలోని చందన్ నగర్ ఏరియాకు చెందిన మాధవ్ తికేటి, స్వరూప ఇద్దరూ దంపతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి చెందిన వీళ్లు పుణెలో స్థిరపడ్డారు. వీరికి మూడేళ్ల కొడుకు హిమ్మత్ మాధవ్ తికేటీ ఉన్నాడు. అయితే ఈ పచ్చని సంసారంలో అనుమానం చిచ్చుపెట్టింది. భార్య స్వరూప వివాహేతర సంబంధం పెట్టుకున్నదని మాధవ్ అనుమానం పెంచుకున్నాడు.
ఈ అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం కూడా స్వరూపతో మాధవ్ గొడవపడ్డాడు. ఉదయాన్నే బార్‌కు వెళ్లి ఫూటుగా మద్యం సేవించి వచ్చి గొడవ చేశాడు. అనంతరం తన మూడేళ్ల కొడుకును తీసుకుని బయటి వెళ్లాడు. అయితే రాత్రయినా భర్త, కొడుకు తిరిగి ఇంటికి రాకపోవడంతో స్వరూప స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టింది.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాధవ్ తన కొడుకును తీసుకుని ఫారెస్ట్ ఏరియావైపు వెళ్తూ కనిపించాడు. సాయంత్రం 5 గంటలకు అతడు ఒంటరిగా బయటికి తిరిగొచ్చాడు. సీసీ ఫుటేజ్ అధారంగా పోలీసులు మాధవ్ కోసం గాలించగా బార్లో ఫుల్లుగా మద్యం తాగి స్పృహ తప్పి పడిఉన్నాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాలుడి గురించి ప్రశ్నించగా చంపేసినట్లు ఒప్పుకున్నాడు.
దాంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అటవీ ప్రాంతంలో గాలించి బాలుడు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టు మార్టానికి పంపించారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.