Crime news : మద్యం తాగొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి క్షణికావేశానికి లోనయ్యాడు. తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో కొడుకు, కోడలిపై కాల్పులు జరిపాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్ పట్టణంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గోరక్‌పూర్ పట్టణానికి చెందిన రిటైర్డ్ హోంగార్డ్ హరియాదవ్కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు ఉన్నారు.
ఈ క్రమంలో హరియాదవ్ రోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడు. శనివారం రాత్రి కూడా ఎప్పటిలాగే ఫూటుగా మద్యం సేవించి వచ్చి గొడవకు దిగాడు. దాంతో కొడుకులు, కోడళ్లు గొడవకు దిగొద్దని, అసలు మద్యం తాగడం మానేయాలని హెచ్చరించారు. దాంతో ఆగ్రహించిన హరియాదవ్ తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో హరియాదవ్ పెద్దకుమారుడికి, చిన్న కోడలుకు తీవ్ర గాయాలయ్యాయి.
కొడుకు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లగా, కోడలు ఎడమ చేయి, కడుపులోకి బుల్లెట్ వెళ్లాయి. వాళ్లిద్దరూ బీఆర్డీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హరియాదవ్ను అరెస్ట్ చేశారు. అతని నుంచి కాల్పులకు వినియోగించిన తుపాకీని సీజ్ చేశారు.