ISRO | న్యూఢిల్లీ: చంద్రయాన్‌పై లోక్‌సభలో గురువారం వాడీవేడి చర్చ జరిగింది. చంద్రయాన్-3 విజయం మాదంటే.. మాదంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పొట్లాడుకున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తల ఘనతను కొట్టేసేందుకు రెండు జాతీయ పార్టీలు పాకులాడాయి. ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధంతో లోక్‌సభలో వాతావరణం వేడెక్కింది. ఇటు బీజేపీ ప్రధాని మోదీ భజనలో మునిగిపోగా.. అటు కాంగ్రెస్ దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భజన చేసింది.
సైన్స్ రంగంలో భారత్ సాధించిన విజయాలపై గురువారం లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఇస్రో ఘనతను ప్రధాని మోదీకి ఆపాదించే ప్రయత్నం చేశారు. మోదీ వల్లే చంద్రయాన్-3 విజయం సాధించిందంటూ వారు పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. మోదీ భజన ఆపాలంటూ చురకలంటించారు. దీంతో మోదీ భజన కంటే మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భజనే ఎక్కువైందంటూ బీజేపీ కాంగ్రెస్‌కు కౌంటర్ వేసింది.