CREA Report | ఏప్రిల్ మాసంలో దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ ఐదో స్థానంలో నిలిచింది. వేసవిలోనూ ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందడం లేదని స్పష్టమవుతున్నది. వేసవిలోనే ఈ పరిస్థితి ఇలా ఉంటే శీతాకాలంలో మరెలా ఉంటుందనేదానికి అద్దం పడుతున్నది. అదే సమయంలో 80శాతం రోజుల్లో కాలుష్యం సాధారణ స్థాయిలోనే ఉంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) ఇటీవలి నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
దేశంలోని 273 నగరాల్లో 248 (90శాతం) ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాల కంటే చాలా ఎక్కువ కాలుష్య స్థాయి ఉందని నివేదిక పేర్కొంది. 248 నగరాల్లో 227 జాతీయ ప్రమాణాల ప్రకారం పీఎం 2.5 స్థాయిని కలిగి ఉన్నాయి. మరో వైపు ఏప్రిల్ నెలలో ఢిల్లీ సగటు PM 2.5 స్థాయి క్యూబిక్ మీటర్‌కు 119 మైక్రోగ్రాములుగా ఉన్నది. ఈ PM 2.5 స్థాయి ఆరోగ్యానికి మాత్రమే ప్రమాదకరమేమీ కాదు కానీ.. ఈ కాలుష్య స్థాయిలో ఎక్కువ కాలం జీవించడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
దేశంలోని పది అత్యంత కలుషిత నగరాల్లో సివాన్, రాజ్‌గిర్, ఘజియాబాద్, గురుగ్రామ్, హాజీపూర్, బాగ్పత్, ఔరంగాబాద్, ససరాం నగరాలు ఉన్నాయి. ఇందులో బీహార్ నుంచే ఐదు నగరాలు, ఉత్తరప్రదేశ్ నుంచి రెండు, అస్సాం, హర్యానా, ఢిల్లీ నుంచి ఒక్కొక్క నగరం ఉన్నది. ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కాలుష్య స్థాయి చాలా ఎక్కువగా ఉందని, మిగిలిన రోజుల్లో సంవత్సరం కాలుష్యాన్ని నియంత్రించినప్పటికీ, అది ఇప్పటికీ వార్షిక సగటు ప్రమాణాల కంటే ఎక్కువగా ఉంటుందని నివేదిక స్పష్టం చేస్తుంది.