న్యూఢిల్లీ: వ్యంగ్యాత్మక డిజిటల్ సంస్థ ‘కాక్రోచ్ జనతా పార్టీ’(సీజేపీ)ని అణచివేస్తున్నారని, వరుస తొలగింపులు, హ్యాకింగ్ సంఘటనల తర్వాత తమ సామాజిక మాధ్యమ ఖాతాలను తాము యాక్సెస్ చేయలేకపోతున్నామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం ఆరోపించారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా హ్యాక్‌కు గురైనదని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. దేశంలో సీజేపీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేసిన రెండు రోజుల తర్వాత, దీప్కే కొత్త ఖాతాను సృష్టించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకున్నది.
విద్యారంగంలో వ్యవస్థాగత వైఫల్యాలు, నీట్‌యూజీ 2026 పేపర్ లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సంస్థ శుక్రవారం ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత నుంచి తనకు ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని దీప్కే ఆరోపించారు. ఆ బెదిరింపు సందేశాల స్క్రీన్షాట్లను కూడా పంచుకొన్నారు. శనివారం ‘ఎక్స్’లో చేసిన మరో పోస్టులో, ఈ ఉద్యమంపై సమన్వయంతో చర్యలు తీసుకొంటున్నారని ఆయన ఆరోపించారు. “కాక్రోచ్ జనతా పార్టీని అణచివేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ పేజీ హ్యాక్ అయింది.
నా వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ కూడా హ్యాక్ అయింది. ట్విట్టర్ ఖాతా నిలిపివేశారు. బ్యాకప్ ఖాతాను కూడా తొలగించారు. ప్రస్తుతం మా ఫ్లాట్‌ఫామ్‌లలో దేనికీ మాకు యాక్సెస్ లేదు. ఇకపై వచ్చే పోస్టులను కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ప్రకటనగా పరిగణించకూడదు” అని ఆయన అన్నారు. ప్రస్తుతం సీజేపీ అధికారిక వెబ్సైట్ కూడా పనిచేయడం లేదు. అధికార యంత్రాంగం తమ ప్లాట్‌ఫామ్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి తాము మంత్రి ప్రధాన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమమే కారణమని దీప్కే అభిప్రాయపడ్డారు. “పేపర్ లీక్‌కు సంబంధించి విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకోవాల్సింది.
ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కోసం చర్యలు తీసుకోవాల్సింది. కానీ నవభారత్‌లో జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసినందుకు కాక్రోచ్ జనతా పార్టీపై చర్యలు తీసుకొంటున్నారు” అని ఆయన విమర్శించారు. ‘ఎక్స్’లో సీజేపీ బ్యాకప్ హ్యాండిల్ ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ ద్వారా పంచుకొన్న ఒక పోస్ట్‌లో.. వారంలోపే తమ వెబ్సైట్ ఒక మిలియన్ నమోదిత కాక్రోచ్ల మైలురాయిని అందుకున్నట్టు సంస్థ తెలిపింది. ఈ అణచివేత చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఈ ఉద్యమం మరింత పెద్దదవుతున్నదని పేర్కొంది. శనివారం ఉదయం 8:25 గంటలకు అదే హ్యాండిల్ నుంచి వచ్చిన మరో పోస్ట్‌లో, సీజేపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ చేయబడిందని, దాని యాక్సెస్ కోల్పోయామని తెలిపింది.
అంతకుముందు ఉదయం 6:50 గంటలకు సీజేపీ నిరసన పిలుపులకు దూరంగా ఉంటున్నట్టు ఒక సందేశాన్ని విడుదల చేసింది. “కాక్రోచ్ జనతా పార్టీ ఎలాంటి నిరసన పిలుపునివ్వలేదు. ఈ మొత్తం ఉద్యమాన్ని బద్నాం చేయడానికి ప్రభుత్వం చిన్న పొరపాటు కోసం వేచి చూస్తున్నది. కాక్రోచ్లు అందరూ శాంతియుతంగా, జాగ్రత్తగా ఉండాలని మేము అభ్యర్థిస్తున్నాము” అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ నివేదిక పోస్ట్ చేసే సమయానికి బ్యాకప్ ఖాతా కాక్రోచ్ ఈజ్ బ్యాక్‌కు 2,02,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. వారి ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 21.9 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. తమ సీజేపీ ఖాతాలను హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, దీనిపై చట్టపరమైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని దీప్కే అంతకుముందు తెలిపారు. సీజేపీ ‘ఎక్స్’ హ్యాండిల్‌ను నిలిపివేయడాన్ని డిజిటల్ హక్కుల సంస్థ ‘ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్’ తప్పుపట్టింది.
ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ శనివారం సీజేపీ ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు. తనను తాను ఒక ‘గౌరవ బొద్దింక’గా అభివర్ణించుకొన్న ఆయన ఈ ప్రచారాన్ని ప్రజాస్వామ్య అభిప్రాయ సేకరణగా చూడాలే తప్ప ఒక ముప్పుగా భావించకూడదని అన్నారు. ‘ఇటువంటి సృజనాత్మక వ్యక్తీకరణల పట్ల భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఈ సందేశాన్ని గ్రహించాలి. సందేశాన్ని తెచ్చిన వారిని చంపకండి. మెసెంజర్‌ను చంపేస్తే సందేశం అంతమైపోదు’ అని పేర్కొన్నారు. ఈ ఉద్యమం అహింసాత్మక, ఊహాత్మక స్వభావాన్ని వాంగ్‌చుక్ అభినందించారు. ఆన్లైన్ వేదికలను అణచివేయడం వల్ల యువతలో అసంతృప్తి మరింత తీవ్రమవుతుందని ఆయన హెచ్చరించారు.