న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి వివిధ పార్టీల అగ్ర నేతలు శనివారం నివాళులర్పించారు. లాల్ సలామ్ నినాదాల మధ్య ఆయన పార్థివ దేహాన్ని ఆయన నివాసం నుంచి పార్టీ ప్రధాన కార్యాలయం ఏకేజీ భవన్‌కు తీసుకొచ్చారు. సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బృందా కారత్, పినరయి విజయన్, ఎంఏ బేబీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, టీఆర్ బాలు; సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు. ఆనంతరం ఆయన పార్థివ దేహాన్ని ఎయిమ్స్‌కు అప్పగించారు.
మృతదేహాన్ని విరాళంగా ఇవ్వడం ఎలా?
అవయవాలను దానం చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. వ్యక్తి తాను జీవించి ఉన్న కాలంలో తన అవయవాలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకోవచ్చు. ఓ ఫారాన్ని నింపి, తాను సంతకం చేసి, ఇద్దరు సాక్షుల చేత సంతకాలు చేయించాలి. సాక్షుల్లో ఒకరు సమీప బంధువు అయి ఉండాలి. మరణానంతరం కుటుంబ సభ్యులు మరణించిన వ్యక్తి కోరిక మేరకు విరాళంగా ఇవ్వవలసి ఉంటుంది.
వ్యక్తి జీవించి ఉన్న కాలంలో ఇటువంటి నిర్ణయం తీసుకోకపోతే, మరణానంతరం కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను విరాళంగా ఇవ్వవచ్చు. మరణించిన తర్వాత నిర్దిష్ట సమయంలోగా అవయవాలను తొలగించి, దానం చేయాలి. మెదడు పని చేయడం ఆగిపోయిన సందర్భాల్లో మాత్రమే గుండె, కాలేయం, మూత్రపిండాలు, పేగులు, ఊపిరితిత్తులను దానం చేయవచ్చు. సహజంగా మరణించినపుడు కార్నియా, గుండె నాళాలు, చర్మం, ఎముకలను దానం చేయవచ్చు. గుండెను 4 గంటల్లోగా, కాలేయాన్ని 24 గంటల్లోగా, మూత్రపిండాలను 72 గంటల్లోగా, కార్నియాస్‌ను 14 రోజుల్లోగా, ఊపిరితిత్తులను 4-6 గంటల్లోగా మార్చవలసి ఉంటుంది.
దానంగా ఇచ్చే మృతదేహాలను ఏం చేస్తారు?
దవాఖానలకు దానంగా ఇచ్చే మృతదేహాలను ఎలా వినియోగిస్తారు? వాటిని తిరిగి కుటుంబ సభ్యులకు ఇస్తారా? అనే అంశాలపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఇలాంటి మృతదేహాన్ని ఫార్మాలిన్తో పరిరక్షిస్తారు. దీనివల్ల దానిపై బ్యాక్టీరియా లేదా క్రిములు పెరగవు. ఫలితంగా అది క్షీణించదు. కర్ర మాదిరిగా తయారవుతుంది.
ఆ తర్వాత దానిని పరిశోధనల కోసం ఉపయోగిస్తారు. శరీరంలోని వివిధ భాగాల గురించి అధ్యయనం చేసే ప్రథమ సంవత్సరం వైద్య విద్యార్థులు ఇలాంటి మృత దేహాలను ఉపయోగించుకుంటారు. పదే పదే గాలి తగిలేలా ఉంచడం వల్ల కొన్ని రోజులకు ఇలాంటి మృతదేహాలు ఉపయోగించలేని పరిస్థితికి వస్తాయి. అప్పుడు వాటిని తిరిగి కుటుంబ సభ్యులకు ఇస్తారు. అంటే అప్పటికి మృతదేహం పూర్తిగా చెడిపోదు. శరీర నిర్మాణంలో మార్పులు వస్తాయి, ముఖాన్ని గుర్తు పట్టడం కష్టం కావచ్చు.