న్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి(Sitaram Yechury) కన్నుమూశారు. ఆయన వయసు 72 ఏళ్లు. సీపీఎం ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ ఎంపీ అయిన ఏచూరి.. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కొన్ని రోజుల నుంచి అక్కడే చికిత్స చేపడుతున్న విషయం తెలిసిందే. శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఏచూరి ఇవాళ మరణించినట్లు ఆ పార్టీ ప్రకటించింది.
ఆగస్టు 19వ తేదీన ఎయిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో ఆయన్ను చేర్పించారు. ఆ తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు మార్చారు. 2015లో సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ కారత్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
పార్టీ నేత హరికిషన్ సింగ్ సుర్జీత్ వద్ద ఏచూరి ఎదిగారు. వీపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ , యునెటెడ్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఏచూరి కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ప్రభుత్వానికి సీపీఎం బయటి నుంచి మద్దతు ఇచ్చింది. తొలిసారి ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వానికి కూడా లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఆ సమయంలోనూ ఏచూరి కీలక పాత్రను పోషించాడు. పాలసీ మేకింగ్‌లో కాంగ్రెస్ పార్టీపై ఆయన వత్తిడి తీసుకొచ్చారు.
స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ)లో ఆయన 1974లో చేరారు. ఆ తర్వాత ఏడాదే ఆయన పార్టీ సభ్యుడిగా మారారు. ఎమర్జెన్సీ సమయంలో అతన్ని అరెస్టు చేశారు.