మళయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. మళయాళ నటుడు సిద్ధిఖి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి రేవతి సంపత్ చేసిన ఆరోపణలపై సీపీఐ కేరళ కార్యదర్శి బినయ్ విశ్వం స్పందించారు. సీపీఐ వైఖరి సుస్పష్టమని తాము సినీ పరిశ్రమలో బాధిత మహిళల పక్షాన నిలుస్తామని చెప్పారు. మహిళల భద్రత, రక్షణ కోసం చొరవ తీసుకున్న తొలి రాష్ట్రంగా కేరళ ముందువరసలో నిలిచిందని తెలిపారు.
సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, సమస్యలపై అత్యున్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేశామని, దేశంలోనే ఈ తరహా కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రం కేరళ అని చెప్పారు. గట్టి రాజకీయ సంకల్పం, చొరవతోనే ఇది సాధ్యమైందని అన్నారు. మళయాళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు అత్యున్నత పోలీస్ కమిటీని కేరళ ప్రభుత్వం నియమించిందని ఆయన వెల్లడించారు.
కాగా, మళయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ స్పందించారు. నిర్ధిష్ట ఫిర్యాదులతో ఎవరైనా ముందుకు వస్తే చట్టం తన పని తాను చేస్తుందని సీఎం ఇప్పటికే ప్రకటించారని పేర్కొన్నారు. ఇప్పటివరకూ రాజ్‌భవన్‌కు ఈ దిశగా ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని చెప్పారు.
మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. కేరళ రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏర్పడిన కమిటీ మలయాళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వేళ్లూనుకున్న తీరును కండ్లకు కట్టింది. ఆ కమిటీ రిపోర్టును ప్రభుత్వం ఇటీవల వెల్లడించగా సినీ పరిశ్రమలో ఈ జాఢ్యం ఎలాంటి వెర్రితలలు వేస్తోందో బయటి ప్రపంచానికి బహిర్గతం చేసింది.
Read More :
Autos seized | ఒకే రిజిస్ట్రేషన్‌తో రెండు ఆటోలు.. సీజ్ చేసిన పోలీసులు