CPI : త్వరలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయి. తాజా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) కేరళలో వారి పార్టీ తరఫున పోటీ చేయనున్న నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
వారిలో వాయనాడ్‌లో పోటీ చేయనున్న అభ్యర్థి కూడా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ స్థానంలో సీపీఐ మహిళా అభ్యర్థిని బరిలో దించింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా సతీమణి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సీనియర్ నాయకురాలు అన్నే రాజా రాహుల్‌గాంధీపై పోటీపడబోతున్నారు.
అదేవిధంగా తిరువనంతపురం, మావెలిక్కర, త్రిస్సూర్ స్థానాలకు కూడా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులను ఖరారు చేసింది. తిరువనంతపురం నుంచి పన్నియన్ రవీంద్రన్, మావెలిక్కర నుంచి అరుణ్ కుమార్, త్రిస్సూర్ నుంచి వీఎస్ సునీల్ కుమార్ సీపీఐ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు.