న్యూఢిల్లీ, మే 31: కరోనా వైరస్ మళ్లీ కొన్ని రోజులుగా దేశంలో విజృంభిస్తోంది. దీంతో కొవిడ్-19 యాక్టివ్ కేసులు 3395కు చేరుకున్నాయి. కేరళలో అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం వెల్లడించింది. కేరళలో 1336 యాక్టివ్ కేసులతో మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర(467), ఢిల్లీ(375), గుజరాత్(265), కర్ణాటక(234), పశ్చిమ బెంగాల్ (205), తమిళనాడు (185),యూపీ(117) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పశ్చమ బెంగాల్లో 116 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
శుక్రవారం నుంచి శనివారం వరకు ఏడు మరణాలు చోటుచేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుత వేవ్‌లో ఢిల్లీలో మొదటి కొవిడ్ మరణం నమోదైంది. అయితే చాలా కొవిడ్ కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ తెలిపింది. నిజానికి, కేరళలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధికంగా నిర్వహిస్తున్న కారణంగానే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మిజోరంలో ఏడు నెలల తర్వాత మొదటి కొవిడ్ కేసు నమోదైంది.
కొవిడ్ కేసులు దేశంలో హఠాత్తుగా పెరగడానికి రెండు కొత్త ఒమిక్రాన్ సబ్-వేరియంట్లు ఎల్ఎఫ్7, ఎన్బీ.1.8.1 కారణంగా తెలుస్తోంది. కాగా, జేఎన్.1 వేరియంట్ ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఎల్ఎఫ్.7 లేక ఎన్బీ.1.8ని వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్(వీఓసీ) లేక వేరియంట్స్ ఆఫ్ ఇంటెరెస్ట్(వీఓఐ)గా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఇప్పటి వరకు ప్రకటించలేదు. కొత్త వేరియంట్లుకు రోగ నిరోధక శక్తిని జయించే సామర్థ్యం కొంత ఉండే అవకాశం ఉన్నప్పటికీ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ను అవి కలిగించవచ్చని చెప్పడానికి ఆధారాలేవీ లేవని నిపుణులు తెలిపారు.