న్యూఢిల్లీ, జూలై 15: సుప్రీంకోర్టు చరిత్రలో శుక్రవారం ఓ అరుదైన రోజుగా నిలిచింది. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఉదయం తొమ్మిదిన్నరకే బెంచ్ విచారణ మొదలు పెట్టారు. బెంచ్‌లో ఆయనతోపాటు న్యాయమూర్తులు ఎస్ రవీంద్రభట్, సుధాంశు ధులియా ఉన్నారు. సాధారణంగా పదిన్నరకు గానీ కోర్టులో పని మొదలు కాదు. కానీ ఉదయమే న్యాయమూర్తులు వచ్చి కోర్టుకు కొత్త ఒరవడి దిద్దారు. మామూలు సమయం కంటే ముందు వచ్చిన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అభినందించారు. దీనిపై జస్టిస్ లలిత్ స్పందిస్తూ.. ‘పిల్లలు ఉదయం ఏడు గంటలకు స్కూలుకు వెళ్లగా లేంది మేం ఉదయం తొమ్మిది గంటలకు కోర్టుకు రావడంలో ఇబ్బంది ఏముంటుంది? తొందరగా వస్తే తొందరగా విచారణలు ముగించుకోవచ్చు. మరుసటి రోజు కేసుల పత్రాలు చూసేందుకు సాయంత్రం న్యాయమూర్తులకు ఎక్కువ సమయం ఉంటుంది’ అన్నారు. కోర్టులు తొమ్మిది గంటలకే పని ప్రారంభించాలని, 11.30 నుంచి అరగంట విశ్రాంతి తీసుకోవాలని, తరువాత 2.30 వరకు ఆ రోజు విచారణలు పూర్తి చేయాలని పేర్కొన్నారు.