Indian Railway | విశాఖపట్నం: రైలులో టాయ్‌లెట్, ఏసీ సదుపాయాలు లేకపోవడంతో శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడిన ప్రయాణికునికి రూ.30 వేలు చెల్లించాలని ఇండియన్ రైల్వేను విశాఖపట్నం వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-1 ఆదేశించింది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని హామీ ఇచ్చి, టికెట్ సొమ్మును వసూలు చేసినందువల్ల కనీస మౌలిక సదుపాయాలను కల్పించవలసిన బాధ్యత రైల్వేలకు ఉందని చెప్పింది.
సదుపాయాల గురించి ముందుగా తనిఖీ చేయకుండా రైళ్లను నడుపుతున్నారని వ్యాఖ్యానించింది. బాధితుడు తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి నుంచి దువ్వాడ వెళ్లేందుకు తనకు, తన కుటుంబ సభ్యులకు 4 థర్డ్ ఏసీ టికెట్లను తీసుకున్నారు. వీరు 2023 జూన్ 5న తిరుపతిలో ఈ రైలు ఎక్కారు. మార్గమధ్యంలో టాయ్‌లెట్‌ను ఉపయోగించుకుందామనుకుంటే, దానిలో నీటి సదుపాయం లేదు. అదే విధంగా ఏసీ సక్రమంగా పని చేయలేదు. బోగీ మొత్తం మురికి కూపంగా ఉంది.
దువ్వాడలోని రైల్వే కార్యాలయంలో దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ, స్పందన కరువైంది. ఈ ఆరోపణలను రైల్వే శాఖ తోసిపుచ్చింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని, ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్మును తీసుకోవాలనే ఆలోచనతో ఈ ఆరోపణలు చేశారని చెప్పింది. అయితే కమిషన్ ఫిర్యాదుదారుకు అండగా నిలిచి, ప్రయాణికులు శారీరకంగా, మానసికంగా అనుభవించిన ఆవేదనకు పరిహారంగా రూ.25,000, వ్యాజ్య ఖర్చుల క్రింద రూ.5,000 చెల్లించాలని దక్షిణ మధ్య రైల్వేను ఆదేశించింది.