న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న వైనం మరోసారి బయటపడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని విపక్ష పార్టీల నేతలపై బీజేపీ ఉసిగొల్పుతున్న తీరు బట్టబయలైంది. కోర్టుకు ఈడీ సమర్పించిన ఆధారాలను బీజేపీ నేతలు బహిర్గతం చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఈడీకి నోటీస్ జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు ఆరోపించింది.
ఢిల్లీలో అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన మంత్రి సత్యేందర్ జైన్‌ను మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో గత కొన్ని నెలలుగా ఆయన తీహార్ జైలులో ఉన్నారు. అయితే మంత్రి సత్యేందర్ జైన్, జైలులో వీఐపీ సౌకర్యాలు పొందుతున్నారని ఈడీ ఆరోపించింది. జైలులో ఆయన మసాజ్ పొందుతున్నారని, బిస్లరీ నీరు తాగుతున్నారని తెలిపింది. దీనికి సంబంధించిన ఆధారాలు, వీడియోలను ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. కాగా, ఈ ఆధారాలను గోప్యంగా ఉంచాలని, బహిర్గతం చేయవద్దని ఈడీకి కోర్టు సూచించింది. ఈడీ వాదనల నేపథ్యంలో సత్యేందర్ జైన్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
మరోవైపు మంత్రి సత్యేందర్ జైన్ జైలులో మసాజ్ పొందినట్లుగా చెబుతున్న వీడియోలను బీజేపీ నేతలు బహిర్గతం చేశారు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో రికార్డు చేసిన రెండు వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి సత్యేందర్ జైన్ కోర్టును ఆశ్రయించారు. ఈడీ కోర్టు ధిక్కారానికి పాల్పండిందని ఆరోపించారు. దీనిపై ఢిల్లీ ప్రత్యేక కోర్టు స్పందించింది. ఆధారాలను బహిర్గతం చేయవద్దన్న కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతోపాటు కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఈడీకి నోటీసులు జారీ చేసింది.
కాగా, మంత్రి సత్యేందర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకోలేదని, అది వీఐపీ మసాజ్ కాదని ఆప్ తెలిపింది. వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న ఆయన వైద్యుడి సిఫార్సుతో ఫిజియోథెరపీ చేయించుకున్నట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఈ వీడియోల లీక్‌పై ఈడీకి కోర్టు నోటీసు ఇచ్చిందన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గట్టి పోటీ ఇస్తున్నదని, దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ నేతలు ఈ వీడియోలను రిలీజ్ చేశారని ఆయన ఆరోపించారు.