భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గునాకు చెందిన ఓ జంట తమ దత్త కూతురు (2.6) పట్ల అమానుషంగా ప్రవర్తించి నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది. తమ కుటుంబానికి, వ్యాపారానికి ఆ పాప దురదృష్టం తెచ్చిందని నమ్మి షియోపూర్ జిల్లాలోని ఓ హైవేపై ఒంటరిగా వదిలి వెళ్లింది. ఆ చిన్నారిని వారు లక్ష రూపాయలకు అక్రమంగా ఇండోర్‌లోని ఓ నెట్వర్క్ ద్వారా కొన్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సోయిన్కలాన్లో రోడ్డుపై ఒక చిన్నారి ఒంటరిగా ఉన్నదని ఈ నెల 18న పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఆ పాపను చేరదీసి పిల్లల సంరక్షణ కమిటీకి అప్పగించారు. ఆ కమిటీ ఆ పాపకు వైద్య పరీక్షలు చేయించి సంరక్షణ కేంద్రంలో ఉంచింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఓ వ్యాపారి దంపతులు ఓ వాహనంలో ఆ బాలికను హైవేపై వదిలి వెళ్లారని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా దత్తత పేరుతో కొన్ని ముఠాలు పిల్లలను ఇలా అమ్మేస్తున్నట్టు విచారణలో తేలింది. బాధిత చిన్నారిని ఆమె పెంపుడు తల్లిదండ్రులు శారీరకంగా వేధించేవారని ఆ పాపకు ఆయాగా పనిచేసిన మహిళ వెల్లడించింది.