steal plants | దంపతులిద్దరూ స్కార్పియో కారులో వెళ్తూ.. మొక్కలను దొంగిలించారు. అంతేకాదు అందంగా అలంకరించిన కుండలను కూడా ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకు సమీపంలోని దౌసా(రాజస్థాన్) వద్ద వెలుగు చూసింది. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే వద్ద ఏర్పాటు చేసి సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
జులై 29 సాయంత్రం 5:36 గంటల సమయంలో ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పై స్కార్పియో కారు ఆగింది. కారులో నుంచి దంపతులిద్దరూ దిగారు. ఇక రోడ్డు పక్కనే ఉన్న మొక్కలను దొంగిలించారు. మొక్కలు పెట్టేందుకు అలంకరించిన ఓ 11 కుండలను కూడా ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ ఎక్స్‌ప్రెస్ వేపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా దంపతుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
ఈ దొంగతనంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్ సాహీరాం మాట్లాడుతూ.. రహదారుల వెంట పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. జనాలేమో ఇలా మొక్కలు దొంగిలించడం సరికాదన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.