న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్‌పై ఇవాళ లోక్‌సభలో చర్చ జరిగింది. ఆ చర్చలో సమాజ్‌వాదీ పార్టీ నేత ఎంపీ రామశంకర్ రాజ్‌భర్ మాట్లాడారు. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశం ఆపరేషన్ తందూర్(Operation Tandoor) కోరుకుందన్నారు. ఆ దాడికి కారణమైన ఉగ్రవాదులను రోస్ట్ చేయాలని దేశ ప్రజలు కోరుకున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆశించలేదన్నారు. ప్రభుత్వం సరైన రీతిలో చర్యలు తీసుకునేందుకు విఫలం అయ్యిందన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో జరిగిన జాప్యాన్ని ఆయన ప్రశ్నించారు. మూడు రోజుల్లో చేపట్టాల్సిన మిషన్‌ను ఎందుకు 17 రోజులు ఆలస్యంగా చేపట్టినట్లు ఆయన నిలదీశారు. పెహల్గామ్ అటాక్ పట్ల దేశ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆపరేషన్ సింధూర్ కాదు.. ఆపరేషన్ తందూర్ కోసం ప్రజలు ఎదురుచూశారన్నారు. సిందూర్ సమయంలో చనిపోయిన వంద మంది ఉగ్రవాదుల్లో.. పెహల్గామ్ ఉగ్రదాడి నిందితులు ఉన్నారా అని ఆయన ప్రశ్న వేశారు.
శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ.. ఎన్నికలు జరగనున్న బీహార్‌కు వెళ్లారని, కానీ పెహల్గామ్కు ఎందుకు వెళ్లలేదని ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు. మణిపూర్‌కు కూడా ఇంత వరకు ఎందుకు వెళ్లలేదన్నారు. దీని పట్ల మీరేమైనా సిగ్గుపడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ పట్ల అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని ఎందుకు ట్విట్టర్లో పోస్టు చేయడం లేదని ప్రధాని మోదీని అడిగారు. అమెరికా అధ్యక్షుడి ముందు మీరు నిలబడినప్పుడు మీ ఎత్తు 5 ఫీట్లకు తగ్గుతుందని, మీ ఛాతి 56 ఇంచుల నుంచి 36 ఇంచులకు కుంచించుకుపోతుందని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడంటే మీరెందుకు అంత భయపడుతున్నారని కళ్యాణ్ బెనర్జీ అడిగారు.
స్వతంత్య్ర ఎంపీ పప్పూ యాదవ్ మాట్లాడుతూ.. పెహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులను ప్రభుత్వం ఇంత వరకు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. నెల రోజులు దాటినా వాళ్లను పట్టుకోలేదంటే, అప్పుడు దేశం సురక్షితమైన చేతుల్లో లేదని అర్థం అవుతోందన్నారు. కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఐక్యంగా ఉందని, మే 7 నుంచి 10వ తేదీ మధ్య జరిగిన ఆపరేషన్‌తో పాక్ ఉగ్రవాదాన్ని ఎంత వరకు కట్టడిచేయగలిగామని ఆయన ప్రశ్నించారు.
ఆపరేషన్ సిందూర్‌తో ఏం సాధించామో ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోయిందని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అన్నారు. పెహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన ఉగ్రవాదులు బ్రతికున్నారా లేక హతమయ్యారా అని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం సాధించామో ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంట్లో వెల్లడించాలన్నారు. మీరు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తారని, ప్రధాని మోదీ దేశ సంక్షేమం కోసం రాజకీయాలు చేస్తారని బీజేపీ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. తన ప్రసంగంలో కాంగ్రెస్ నేత గగోయ్.. ఒక్కసారి కూడా పాకిస్థాన్ చర్యను ఖండించలేదని పేర్కొన్నారు.