న్యూఢిల్లీ, అక్టోబర్ 15: పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్.. ఈ ఏడాది గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. పంట ఉత్పత్తిలో ఏకంగా 14 ఏండ్ల దిగువకు పడిపోయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 307.5 లక్షల బేళ్ల పత్తి మాత్రమే ఉత్పత్తి అయ్యింది. గత ఏడాది ఇదే సమయానికి 360.13 లక్షల బేళ్లు వచ్చాయి. 2007-08లో పత్తి ఉత్పత్తి 307 లక్షల బేళ్లుగా ఉన్నది. కాగా, పత్తి సాగు పడిపోవటానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని వ్యవసాయ రంగ నిపుణులు తెలిపారు. అనాలోచిత నిర్ణయాలతో మోదీ సర్కారు ఈ రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నదని విమర్శించారు. వరి, పత్తి ఇలా అన్ని పంటల వ్యవస్థలను నాశనం చేస్తున్నదని మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోదీ.. గత ఏడాదే పది వేల మంది రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు.