Covid-19 | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. ఢిల్లీలోనూ కరోనా విధ్వంసం కొనసాగుతున్నది. తొలిసారిగా దేశ రాజధానిలో కరోనా వైరస్‌తో ఒకే రోజులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఢిల్లీలో కరోనా కారణంగా 11 మంది మరణించారు. ఢిల్లీలో మరణించిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. 57 ఏళ్ల మహిళకు డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి. మరో వ్యక్తికి సైతం ఇవే సమస్యలున్నట్లుగా గుర్తించారు. అలాగే, 83 ఏళ్ల మహిళకు డయాబెటిస్, హై బీపీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి. అయితే, యాక్టివ్ కరోనా రోజుల్లో తగ్గుదల కనిపించింది. శనివారం యాక్టివ్ రోగుల సంఖ్య 672కి తగ్గింది. జనవరి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో కొవిడ్‌తో 11 మంది ప్రాణాలు కోల్పోయరు.
ముగ్గురి మరణానికి కొవిడ్ మాత్రమే కారణం కాదని.. వారికి ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు సైతం కారణమని వైద్యులు తెలిపారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం.. 24గంటల్లో 212 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఢిల్లీ రెండోస్థానంలో ఉన్నది. కొవిడ్ కేసులకు కొత్త వేరియంట్ కారణమని భావిస్తున్నారు. అయితే, వాటితో అంతగా ప్రమాదమేమీ లేదని.. గతంలో వేరియంట్ల తరహాలో ప్రాణాంతకం కావని పేర్కొన్నారు. అయితే, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తేలికపాటి లక్షణాలు కనిపించినా.. ఆ తర్వాత తీవ్రమైన శ్వాసకోశ సమస్యల వరకు పెరగవచ్చని పేర్కొంటున్నారు. కరోనా సాధారణ లక్షణాలో చలిగా ఉండడం, పొడిదగ్గు, గొంతునొప్పి, ఒంటినొప్పులు, అలసట, వాసన, ఉచి చూసే సామర్థ్యం తగ్గిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే, కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన పని లేదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, జలుబుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతున్న రోగులు వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకొని.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.