శనివారం 16 జనవరి 2021
National - Nov 28, 2020 , 01:59:59

కరోనాకు టీకా అక్కర్లేదు!

కరోనాకు టీకా అక్కర్లేదు!

  • 30శాతం మందికి ముందే ఇమ్యూనిటీ
  • వైరస్‌ ముప్పులేని వారికి టీకా వేయకూడదు
  • ఫైజర్‌ మాజీ అధ్యక్షుడు మైఖెల్‌ వ్యాఖ్య
  న్యూఢిల్లీ: తమ వ్యాక్సిన్‌ కరోనాను సమర్థంగా అడ్డుకుంటున్నట్టు ఓ వైపు ఫైజర్‌ కంపెనీ ప్రకటించగా.. మరోవైపు, ఆ కంపెనీ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌, మాజీ చీఫ్‌ సైంటిస్ట్‌ మైఖెల్‌ యాడన్‌ మాత్రం  కరోనా మహమ్మారిని అంతం చేయడానికి ఎలాంటి వ్యాక్సిన్లు అవసరం లేదని పేర్కొన్నారు. ‘వ్యాధి ముప్పు లేనివారికి టీకా వేయనవసరం లేదు. అలాగే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నవారికి.. మనుషులపై విస్తృతంగా పరీక్షలు నిర్వహించని టీకాలను వేయాలనుకోవడం మంచిది కాదు’ అని ఆయన స్పష్టంచేశారు. అత్యవసర సమయాల్లో బ్రిటన్‌ ప్రభుత్వానికి సలహాలు అందించే ‘సైంటిఫిక్‌ అడ్వైజర్‌ గ్రూప్‌ ఫర్‌ ఎమర్జెన్సీస్‌' (సేజ్‌)పైనా ఆయన విమర్శలు చేశారు. ‘ప్రతి ఒక్కరికీ వైరస్‌ ముప్పు ఉన్నదని, 7 శాతం మంది వైరస్‌ బారినపడ్డారని సేజ్‌ చెబుతున్నది. ఇది నమ్మశక్యంగా లేదు. శ్వాసకోశ వైరస్‌లకు సంబంధించి గత పరిశోధనలను వారు విస్మరించారు. 30 శాతం మందికి ముందుగానే వ్యాధి నిరోధక శక్తి ఉన్నట్టు ప్రముఖ ఇమ్యునాలజిస్ట్‌ల పరిశోధనల్లో తేలింది’ అని ఆయన వివరించారు. 

  ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అనుమతివ్వండి: బ్రిటన్‌

  ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు తాత్కాలిక అనుమతినివ్వాలని బ్రిటన్‌ ప్రభుత్వం ఆ దేశ వైద్య రెగ్యులేటరీ సంస్థకు శుక్రవారం విజ్ఞప్తి చేసింది. టీకా సమర్థత, రక్షణ, భద్రతకు సంబంధించి కంపెనీ ఇచ్చిన వివరాలను విశ్లేషించిన తర్వాత ఈ అనుమతులను మంజూరు చేయాల్సిందిగా వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అనుమతులు మంజూరైతే ఈ ఏడాది చివరినాటికి 4 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. కాగా, తమ టీకా తయారీలో తప్పు దొర్లిందని ఆక్స్‌ఫర్డ్‌ బుధవారం ప్రకటించడం తెలిసిందే. 

  నిర్లక్ష్యం వద్దు: హర్షవర్ధన్‌ 

  కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలిగిపోలేదని, ప్రజలు మరికొంతకాలం జాగ్రత్తలు పాటించాల్సిందేనని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు.  కరోనా కట్టడికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని అభినందించారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ), ఫ్యాప్సీ, ఫిక్కి, ఏఎస్‌సీఐ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన వెబినార్‌లో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడారు. తెలంగాణ, ఏపీల్లో ప్రభుత్వ దవాఖానల్లో ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటుచేయడం, ఉచితంగా చికిత్స అందించడంపై హర్షం వ్యక్తంచేశారు.  కాగా, ఇప్పటివరకు గుర్తించిన కరోనా వైరస్‌ ఉత్పరివర్తనాలేవీ మనుషుల్లో కొవిడ్‌ తీవ్రతను పెంచలేదని బ్రిటన్‌ పరిశోధకులు తెలిపారు. కేరళలోని ప్రముఖ దేవస్థానం శబరిమలలో 39 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. 

  సీసీఎంబీ డ్రై స్వాబ్‌ టెస్ట్‌కు అనుమతి

  కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)కు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్‌ కరోనా టెస్టింగ్‌కు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆమోదం తెలిపింది. ఆర్‌ఎన్‌ఏ తొలగింపుతో సంబంధం లేని ఈ టెస్టింగ్‌ విధానం కరోనా పరీక్షల పరంగా కీలక మార్పునకు నాందిపలుకుతుందని హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే సీసీఎంబీ పేర్కొంది. డ్రై స్వాబ్‌ టెస్టింగ్‌ వల్ల వ్యయంతోపాటు సమయం 40-50 శాతం మేర ఆదా అవుతుందని వెల్లడించింది.