గౌహతి: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మరణించారు. అయితే పోలీసులు చాలా అమానుషంగా ప్రవర్తించారు. వారి మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. (Cops Drag Bodies On Road) ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అస్సాంలోని దర్రాంగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నందిత అనే యువతి గౌహతి యూనివర్శిటీలో మొదటి సెమిస్టర్ చదువుతున్నది. అక్టోబర్ 30న తండ్రి మధుర నాథ్ దేకా స్కూటర్‌పై యూనివర్సిటీకి వెళ్లాడు. కుమార్తె నందితను ఎక్కించుకుని సిపజార్లోని ఇంటికి వెళ్తున్నాడు.
అయితే రాత్రి వేళ మంగళ్దోయ్ ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వారి స్కూటర్ ఢీకొట్టింది. దీంతో తండ్రీకుమార్తెలు రోడ్డుపై పడ్డారు. ఇంతలో వేగంగా వచ్చిన మరో లారీ వారి మీదుగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.
కాగా, రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తండ్రీకుమార్తెల మృతదేహాలను ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టారు. పోస్ట్‌మార్టం కోసం తరలించేందుకు దూరంలో ఉన్న వాహనం వద్దకు వారి మృతదేహాలను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఇది చూసి అక్కడున్న జనం షాక్ అయ్యారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అస్సాం పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. రోడ్డు ప్రమాదంలో మరణించిన తండ్రీకుమార్తెల మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లో కట్టి రోడ్డుపై ఈడ్చిన అమానవీయ చర్యపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జీపీ సింగ్ దీనిపై స్పందించారు. ఆ పోలీస్ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Inhuman @assampolice ! Sensational incident at Mangaldoi. In utmost disrespect to the deceased, Police dragged polythene-wrapped bodies of father-son. The duo died in a road mishap earlier in the day @himantabiswa pic.twitter.com/SEuyzc10w4
— atanu bhuyan (@atanubhuyan) October 30, 2024