అహ్మదాబాద్: సొంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటించారు. ఈ నేపథ్యంలో దీనికి ముందు రోజు పీఎం కాన్వాయ్ వెళ్లడం కోసం సూరత్‌లో రిహార్సల్ నిర్వహించారు. అయితే ఈ విషయం తెలియని 17 ఏళ్ల యువకుడు రతన్ చౌక్ వద్ద సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు. (Cop Slaps Boy) పోలీసులు వారించడంతో వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడున్న పోలీస్ అధికారి ఆ యువకుడిపై తన ప్రతాపం చూపాడు. అతడి జట్టుపట్టుకుని లాగడంతోపాటు తల, చెంపపై కొట్టాడు. ఆ తర్వాత మైనర్ బాలుడ్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొన్ని గంటలపాటు పోలీస్ స్టేషన్లో ఉంచారు. దీంతో ఆ యువకుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
కాగా, రాత్రి 9.30 గంటల తర్వాత ఆ యువకుడ్ని పోలీసులు విడిచిపెట్టారు. దీంతో అతడు ఏడుస్తూ ఇంటికి చేరుకున్నాడు. పోలీసులు తనను అకారణంగా కొట్టారని, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఈ విషయం తెలిసి ఆ బాలుడి కుటుంబం ఆందోళన చెందింది.
మరోవైపు ఆ బాలుడ్ని పోలీస్ అధికారి కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. బాలుడ్ని కొట్టిన ఎస్ఐ బీఎస్ గాధ్వీపై చర్యలు చేపట్టారు. మోర్బి జిల్లాలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆయనను కంట్రోల్ రూమ్‌కు బదిలీ చేసినట్లు డీసీపీ తెలిపారు. అలాగే ఆ పోలీస్ అధికారి వేతనం పెంపును కూడా ఏడాది పాటు నిలిపివేసినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
Gujarat Police Beating Child During Rehearsal Of Prime Minister Modi’ Rally In Surat.pic.twitter.com/pbJ5NzTsK5 #Surat #GujaratPolice #NarendraModi #SuratPolice #Gujarat #ModinGujarat #WelcomeModiji
— 𝐁𝐫𝐢𝐣𝐞𝐬𝐡 𝐅𝐚𝐥𝐝𝐮 (@BrijeshFaldu1) March 6, 2025