న్యూఢిల్లీ: ఇంటర్నెట్లో ఓ వీడియో వైరల్గా మారింది. ర్యాపిడోకు చెందిన క్యాబ్లో ఎక్కిన నలుగురు ప్రయాణికులను ఆ క్యాబ్ డ్రైవర్ దిగిపోవాలని కోరుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ ప్రయాణికులు తమలోని ఒక సీనియర్ ఉద్యోగి గురించి మాట్లాడుతున్న సమయంలో వారు కుల వివక్షకు సంబంధించిన పదాలను పదేపదే ఉపయోగించారని, దీనికి తాను అభ్యంతరం వ్యక్తం చేశానని, చివరకు వారిని దిగిపోవాలని కోరానని సదరు క్యాబ్ డ్రైవర్ అంకిత్ తెలిపారు.
ఆ నలుగురు ప్రయాణికులు రైల్వే ఉద్యోగులు. ఈ ఘటన జరిగిన తర్వాత ర్యాపిడో డ్రైవర్ అంకిత్ కుమార్ను 99 ఏండ్ల 11 నెలల పాటు సస్పెండ్ చేసింది. అయితే ఆ ప్రయాణికులపై ర్యాపిడో గానీ, భారతీయ రైల్వేగానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఎలాంటి బహిరంగ ప్రకటన కూడా చేయలేదని ‘ది వైర్’ తన కథనంలో పేర్కొంది. అయితే క్యాబ్ డ్రైవర్ కావాలనే ఈ వీడియోను రూపొందించారని, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్( ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ) చట్టాన్ని దుర్వినియోగం చేశారని, ప్రయాణికులు కూడా ఎస్సీ, ఎస్టీ ఇతర వెనుకబడిన వర్గాలకు(ఓబీసీ) చెందినవారేనని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.