బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ సర్కార్కు ఆ రాష్ట్ర కాంట్రాక్టర్ల అసోషియేషన్(కేఎస్సీఏ) అల్టిమేటం జారీచేసింది. పెండింగ్లో ఉన్న రూ.37,370 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించింది. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా ఉన్నదని, అప్పులు పేరుకుపోవడంతో చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొన్నదని అసోసియేషన్ అధ్యక్షుడు మంజునాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులకు అనేకసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని, ఇక నిరసనలకు దిగడం తప్ప తమకు వేరే గత్యంతరం లేదని స్పష్టం చేశారు. మునుపటి ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి మరింత పెరిగిపోయిందని కేఎస్సీఏ జనరల్ సెక్రటరీ నందకుమార్ ఆరోపించారు. బీజేపీ హయాంలో బిల్లుల మంజూరుకు 40 శాతం కమీషన్ చెల్లించాల్సి వచ్చేదని కాంట్రాక్టర్ల అసోసియేషన్ అప్పట్లో ఆరోపించిన విషయం తెలిసిందే.